Reading Time: < 1 minute

అమరావతి: పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. పిఠాపురంలో పవన్ పర్యటించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలికని.. నిర్మించడం కష్టమని.. ఒక కూటమిని నిర్మించడం చాలా కష్టమని తెలియజేశారు. అందరినీ ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమని అన్నారు. తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లండని, తెలంగాణ సోదర సోదరిమణులను సంక్రాంతికి ఆహ్వానించండని సూచించారు. తెలంగాణ సోదరసోదరీమణులకు గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపండని, తాను వ్యవస్థను బలోపేతం చేసేందుకు వచ్చానని అన్నారు. గత ప్రభుత్వంలో ఏం చేశారో వైసిపి నాయకులను అడగాలని, పిఠాపురంలో స్కూళ్లో పిల్లలు కొట్టుకున్నా పెద్దవార్త అవుతుందని విమర్శించారు. పిల్లల కొట్లాటలో కూడా కులాలను తీసుకొస్తున్నారని, పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదని అన్నారు. తనను పరిమితం చేస్తే తన శక్తిని చంపేనట్టేనని, తనను బలోపేతం చేస్తే మరింతగా పనిచేస్తానని పేర్కొన్నారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.