Reading Time: < 1 minute

భోపాల్: వృద్ధుడిని చంపిన కేసులో పేపర్ ముక్క నిందితులను పట్టించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాలో జరిగింది. వంశపారపర్యంగా వస్తున్న భూమి విషయంలో 70 ఏళ్ల వృద్ధడిని తన మేనల్లుడు హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగాపుర గ్రామంలో శివనారాయణ కౌరవ్ అనే వృద్ధుడికి 31 ఎకరాల భూమి ఉంది. శివనారాయణకు ఆమె చెల్లి సుర్జా దేవి, ఆమె భర్త రామస్వరూప్ లు మధ్య ఆస్తుల విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. సుర్జా, రామస్వరూప్ చనిపోయిన తరువాత భూముల విషయంలో దంపతుల కుమారుడు శివరతన్ గొడవలకు దిగుతున్నాడు. పలుమార్లు తన మేనమామ శివనారాయణతో గొడవకు దిగాడు. ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. నవంబర్ 14న రాత్రి పొలం దగ్గర పడుకున్న శివ నారాయణను గొడ్డలితో నరికి చంపారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో పేపర్ ముక్క కనిపించింది. పోలీసుల డాగ్ స్వాడ్‌తో పేపర్ ముక్క వాసన చూపించి వదిలారు. అదే గ్రామానికి చెందిన బాదమ్ సింగ్ ఇంట్లోకి డాగ్ వెళ్లింది. దీంతో బాదమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పోలీసులను పక్కదారి పట్టించాడు. పోలీసులు తనదైన శైలిలో పలుమార్లు ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. శివరతన్ అతడి కుమారుడు మహేంద్ర సింగ్‌తో కలిసి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారు కూడా నిజాలు ఒప్పుకున్నారు. హత్యలో ఉపయోగించిన ఐరన్ రాడ్‌తో పాటు గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.