
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు సినిమా థియేటర్ ఓపెనింగ్‌కు వెళ్తున్నారని, ఇప్పుడు అదే అశోక్ నగర్‌లో నిరుద్యోగులను కలిసే దమ్ముందా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రశ్నించారు. అదే అశోక్ నగర్‌లో ఎన్నికల సమయంలో రేవంత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ థియేటర్ పక్కనే సెంట్రల్ లైబ్రరీ ఉంటుందని, ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్లిరా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మొన్న శ్రీధర్ బాబు అసెంబ్లీలో అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేశారని, భట్టి విక్రమార్క ఏమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని చురకలంటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు వెళ్తుంటే వేల మంది పోలీసులను భద్రతగా పెట్టుకున్నారని మండిపడ్డారు. నిన్న మొన్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరసనలు చేస్తే పోలీసులతో బూతులు తిట్టించడంతో కొట్టించారని దుయ్యబట్టారు.
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోందని విమర్శించారు. మొన్నటి పిజి వైద్య విద్య పరీక్షల్లో బయటపడిన మెడికల్ స్కాం ఇంకా మరువకముందే, ఇప్పుడు అగ్రికల్చర్ బిఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, ఎఐ పెన్‌లతో రాసిన మోడరన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని హరీష్ ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రలో మునిగిపోతుందని కడిగేశారు.
మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారిందని దుయ్యబట్టారు. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి, రేవంత్ రెడ్డి విలువల్లేనితనానికి నిదర్శనమని ధ్వజమతె్తారు. మహాకవి శ్రీశ్రీ “కాదేదీ కవితకు అనర్హం” అని చెప్పారు… కానీ రేవంత్ రెడ్డి “కాదేదీ స్కాంకు అనర్హం” అని చెప్పడమే కాకుండా, చేసి చూపిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాదు, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతకాదు..ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం’ అని ఆగ్రమం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.