Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మళ్లీ శ్రీకారం చుట్టిందని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రభుత్వం అమలు చేయనుందని అన్నారు. భద్రాద్రి: అశ్వరావుపేటలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పున: ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల క్రితం వ్యవసాయ యాంత్రీకరణ నిలిచిపోయిందని,అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ పరికరాల ప్రదర్శన జరిగిందని తెలియజేశారు. భద్రాద్రి జిల్లాలో 50 శాతం రాయితీలపై వ్యవసాయ పరికరాలు పంపిణీ జరిగిందని, పంటలకు రసాయనాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతోందని, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కంటే అధిక పంట దిగుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో 148 లక్షల టన్నుల వరి పంట పండిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్థాయిలో పంట రాలేదని అన్నారు. దేశంలో తొలిసారి 70 లక్షల టన్నుల పంట సేకరణ జరిగిందని, పంట సేకరణకు సంబంధించి రైతులకు 48 గంటల్లో చెల్లిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.