
అమరావతి: రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏటా కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే అతిపెద్ద పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగ్గన్నతోట ప్రభల తీర్థం సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న వేడుక అని.. 11పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని తెలియజేశారు. కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు. కోనసీమలో సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.