Reading Time: < 1 minute

చెన్నై : సంక్రాంతికి తమిళ హీరో రాజకీయ సంచలనం విజయ్ తాజా సినిమా జన నాయగన్ విడుదల అవుతుందా? లేదా అనేది శుక్రవారం తేలనుంది. సెన్సార్ ఇతర వివాదాలలో చిక్కిన ఈ సినిమా విడుదలపై మద్రాసు హైకోర్టు నేడు (శుక్రవారం) ఆదేశాలు వెలువరించనుంది. వీటిపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ సినిమానే తన చివరి సినిమా అని విజయ్ సింగపూర్‌లో ఇటీవల జరిగిన ప్రమోషన్ సభలో తెలిపారు. అయితే సినిమాకు ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఈ నెల 9 శుక్రవారం విడుదల కావల్సిన సినిమాను వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ప్రకటన కూడా వెలువరించారు. సెన్సార్ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకే హైకోర్టు తీర్పు వెలువరిస్తుంది. దీనిపైనే విజయ్ సినిమా విడుదల సస్పెన్స్ వీడనుంది.

సినిమాలో పలు కీలక రాజకీయ అంశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇందులోని కొన్ని నన్నివేశాలకు సెన్సార్ బోర్డు కట్స్ చెప్పింది. కొన్ని డైలాగ్‌లను మ్యూట్ చేయాలని ఆదేశించింది. షరతులతో కూడిన విడుదలపై నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్‌కు దిగారు. వాదోపదవాదాల తరువాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. శుక్రవారం దీనిని వెలువరిస్తుంది. విజయ్ ఫ్యాన్స్ హైకోర్టు తీర్పు పట్ల ఆసక్తితో ఉన్నారు. పలు భాషలలో ఈ సినిమా విడుదల కావల్సి ఉంది. భారీ బడ్జెట్ సినిమా, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల అయ్యే ఈ తళపతి విజయ్ సినిమా పట్ల తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.

విడుదల అవుతుందా? కాదా అనే ప్రశ్నలు తారాస్థాయికి చేరాయి. ప్రధాన హీరోల సినిమాలకు సెన్సార్ వివాదాలు తలెత్తడం, చివరి క్షణాలలో ఇవి వాయిదా పడటం పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు అసహనంతో ఉన్నాయి. సెన్సార్ బోర్డు వైఖరిపై అనేక సార్లు తమిళ చిత్ర పరిశ్రమ వారు మండిపడుతున్నారు. జననాయగన్‌కు హెచ్ వినోత్ దర్శకత్వం వహించారు. విజయ్ ప్రధాన పాత్రలో ఉన్నారు. కాగా ఈ సినిమాలో హిందీ హీరో బాబీ డియోల్ , పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, మమితా బైజూ ఇతర తారాగణంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పట్ల బాగా టాక్ వచ్చింది.