
నవీ ముంబై: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026కి శుక్రవారం తెరలేవనుంది. ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. నవీ ముంబై, బరోడా వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. లీగ్ దశలోని 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ సమరానికి బరోడాలోని కొటాంబి స్టేడియం వేదికగా నిలువనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు బరిలో దిగనున్నాయి.
శుక్రవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఇప్పటి వరకు మూడు సీజన్‌లు జరగగా ముంబై రెండింటిలో విజేతగా నిలిచింది. ఒకసారి బెంగళూరు ట్రోఫీని సాధించింది. బరిలో ఉన్న అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. గుజరాత్ జెయింట్స్‌కు ఆష్లే గార్డ్‌నర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.డానిల్లి వ్యాట్, సోఫి డివైన్, బెథ్ మూని, రేణుకా సింగ్, యస్తిక భాటియా వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. ముంబై టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుది. హీలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, అమెలియా కెర్, నాట్ సివర్ బ్రంట్, షబ్నమ్ ఇస్లాయిల్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇక బెంగళూరు టీమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. పూజా వస్త్రకర్, జార్జియ, హేమలత, గ్రేస్ హారిస్, నడైన్ డి క్లర్క్, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి తదితరులు జట్టులో ఉన్నారు. యూపి టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్‌లానింగ్ కెప్టెన్‌గా వ్యహరిస్తోంది. ప్రతిక రావల్, లిచ్‌ఫీల్డ్, దీప్తి శర్మ, డాటిన్, హర్లిన్ డియోల్. సోఫి ఎకిల్‌స్టోన్ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. మరోవైపు ఢిల్లీ టీమ్‌కు జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో అసాధారణ ఆటను కనబరిచిన రోడ్రిగ్స్ డబ్లూపిఎల్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించేందుకు సిద్ధమైంది. షఫాలీ వర్మ, వాల్‌వర్డ్, అలనా కింగ్, స్నేహ్ రాణా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అన్ని టీమ్‌లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఈసారి డబ్లూపిఎల్ మరింత ఆసక్తికరంగా సాగడం ఖాయం.
రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో..