
క్రీడలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలనే పెద్ద పెద్ద మాటలు ‘సత్యమునే పలుకవలెను’ లాంటి నీతి వాక్యాల లాంటివే తప్ప ఆచరణలో సాధ్యమయ్యేవి కాదు. కోల్డ్‌వార్ రోజుల్లో అమెరికా, సోవియెట్ కూటములు ఒలింపిక్స్ బహిష్కరించడంతో సహా క్రీడలపై రాజకీయాల నీడ మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా భారత ఉపఖండంలో క్రీడలను, రాజకీయాలను వేరు చేసి చూడటం పూర్తిగా అసాధ్యం. ఉపఖండంలోని ఏ ప్రభుత్వమైనా ప్రజల భావోద్వేగాల ఆధారంగానే జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు నడిపిస్తుంటుంది. ఈ కారణంగానే తాజాగా ఇండియా- బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు రాజకీయ రంగు పులుముకుని చివరి పేజీ బదులు మొదటి పేజీ వార్తలవుతున్నాయి.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మాన్ ను ఐపిఎల్‌లో ఆడించకూడదని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయం, దాని తదనంతర పరిణామాలు చూస్తుంటే ఇది చిలికిచిలికి గాలివానగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే నెలలో మన దేశంలో జరగబోతున్న టి20 ప్రపంచ కప్ పైన కూడా దీని ప్రభావం పడుతోంది. బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు మనకు తెలుసు. అయితే ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో బిసిసిఐ మొదట్లోనే సరిగ్గా వ్యవహరించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలంటారు. బంగ్లాదేశ్ సంక్షోభం ఈ రోజున కొత్తగా మొదలైనదేమీ కాదు. క్రితం నెల జరిగిన ఐపిఎల్ వేలంపాటలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పేర్లు ముందుగానే తొలగించి ఉంటే సరిపోయేది. ఐపిఎల్ వేలానికి వెయ్యి మందికి పైగా ప్లేయర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు. అయితే ఆ జాబితాను కుదించి కొన్ని వందల మందిని మాత్రమే వేలంపాటలో పెడతారు. కానీ బిసిసిఐ బంగ్లా ఆటగాళ్ల పేర్లు తొలగించినా, లేదా వారిని తీసుకోవద్దని ఫ్రాంచైజీలకు రహస్యంగా చెప్పినా సరిపోయేది. ఈ వివాదానికి ఆస్కారం ఉండేది కాదు.
వేలంపాటలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ ను తొమ్మిది కోట్ల రూపాయలకు తీసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును నెటిజెన్లు తప్పుపట్టారు. ముఖ్యంగా ఆ జట్టు యజమాని షారుఖ్ ఖాన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే కోల్‌కతా జట్టు ఆటగాళ్ల ఎంపికలో షారుఖ్ ఖాన్ ప్రమేయం ఉండే అవకాశం లేదు. జట్టు క్రికెట్ వ్యవహారాలు కోచింగ్ సిబ్బంది చూసుకుంటారు. వేలంలో ముస్తఫిజుర్ కోసం హిందూ యజమానులున్న చెన్నై, ఢిల్లీ కూడా పోటీపడ్డాయి. కానీ ట్రోలర్లు ఇవన్నీ విస్మరించి షారుఖ్ పనిగట్టుకుని ఆ ముస్లిం ఆటగాడిని తీసుకున్నాడని నానా దుర్భాషలాడారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలీదా జియా మరణం తర్వాత డిసెంబర్ ఆఖరు వారంలో విదేశాంగ మంత్రి జైశంకర్, ఢాకా వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. కానీ దాన్ని ఎవరు తప్పు పట్టలేదు. బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టు నెలలో కూడా మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. కానీ అదే ఏడాది సెప్టెంబర్ లో బంగ్లా జట్టు ఇండియా వచ్చి టెస్ట్ మ్యాచులు ఆడింది. అప్పుడు చిన్నపాటి నిరసనలు మినహా ఇప్పటిలాగా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు కనబడలేదు. ఐపిఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పించడంపై బంగ్లాదేశ్ కూడా తీవ్రంగానే స్పందించింది. తమ దేశంలో ఐపిఎల్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, వచ్చే నెల ఇండియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో తమ దేశం ఆడే మ్యాచులు శ్రీలంకలో జరపాలని బంగ్లాదేశ్ కోరింది. ఇండియాలో తమ జట్టు భద్రత విషయంలో వారికి అనుమానాలున్నాయట. (పాకిస్తాన్ కూడా ఇండియాలో ఆడటానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఇప్పటికే వారి మ్యాచులు శ్రీలంకలో జరుపుతున్నారు.)
ఈ మొత్తం వ్యవహారం వల్ల ఆతిథ్య దేశంగా ఇండియా ప్రతిష్ఠ కొంత దిగజారిందని చెప్పాలి. కామన్‌వెల్త్ క్రీడలు మన దేశంలో జరగనున్నాయి. ఒలింపిక్స్ కూడా జరపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలా కొన్ని దేశాలు ఇండియాలో ఆడడానికి ఇష్టపడకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి.
పాకిస్తాన్ విషయంలో కూడా బిసిసిఐ వైఖరి విచిత్రంగా కనిపిస్తుంది. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లలో పాకిస్తాన్ తో తప్పనిసరి అయితేనే ఆడతాం అంటారు కానీ ఆసియా కప్‌లో, ప్రపంచ కప్‌లో రెండు జట్లను ఒకే గ్రూపులో పెట్టినా అభ్యంతరం చెప్పరు. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఆంటే కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి అది వారికి ఇష్టమే. కానీ మా కెప్టెన్ పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు చూశారా అని జబ్బలు చరుచుకుంటారు. మనకు సమస్యలున్న దేశాలతో ఆడటం గురించి ఖచ్చితమైన విధాన నిర్ణయాలు ఉంటే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. కానీ బిసిసిఐకు క్రికెట్‌ను రకరకాలుగా మార్కెటింగ్ చేసి డబ్బులు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ, మిగతా విషయాలలో కనబడదు.
సి. వెంకటేష్ (రచయిత సీనియర్ జర్నలిస్ట్, క్రీడా విశ్లేషకులు)