
క్రీడాకారులు నిజమైన దౌత్యవేత్తలు- ఇది అందరూ విశ్వసించేదే. గతంలో చాలా సందర్భాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసుల్ని ఏర్పాటు చేసి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేయడం లాంటివి జరిగాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న దౌత్య కారణాలతో క్రీడా సంబంధాలు ప్రస్తుతానికైతే పూర్తిగా నిలిచిపోయిట్లే. తాజాగా బంగ్లాదేశ్ జత కలిసింది. బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక చర్యలు జరుగుతుండటం, మరీ ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న హిందువులని దారుణంగా హింసిస్తూ, చంపడం లాంటివి జరుగుతున్న సందర్భంలో భారత్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటూ, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ని కెకెఆర్ జట్టు ఐపిఎల్లో ఆడించకుండా ఉండాలని బిసిసిఐ నిర్ణయించడంతో బిసిబి (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరిలో నిర్వహించబోయే టి20 ప్రపంచ కప్లో ఆడబోవట్లేదనేది దాని సారాంశం. కారణం బంగ్లాదేశ్ మ్యాచ్ ఇండియాలోనే ఉంది. దానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా మద్దతివ్వడం ఇక్కడ చర్చనీయాంశం.
ఏ దేశానికైనా వారి సార్వభౌమాధికారం, వారి దేశ ప్రతిష్ఠ, అక్కడి ప్రజల రక్షణ అత్యంత ప్రాధాన్యాలు, కాదనేది ఏదీ లేదు, కానీ ఇక్కడ గమనించాల్సింది, స్వయంగా బంగ్లాదేశ్ క్రికెటర్ ‘సకీబుల్ హాసన్’వీరి దేశంలో రక్షణ లేదని, కాబట్టి బంగ్లాదేశ్లో ఉండలేనని, అక్కడ ఆడలేనని చెప్పి దేశం బయట ఉంటున్నప్పుడే అక్కడి పరిస్థితి కళ్లకి గట్టినట్లు అర్థమవుతుంటే, బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం మన చర్యల్ని తప్పుపట్టాలని చూపే ప్రయత్నం హాస్యాస్పదం.
ప్రస్తుతానికి బిసిబి టి20 ప్రపంచ కప్ ఆడటానికి తమ జట్టుని భారత్ పంపమని, వేదికని శ్రీలంకకు మార్చమని అడుగుతోంది. అది అయ్యే పని కాదని వీళ్లకీ తెలుసు. కాకపోతే మేకపోతు గాంభీర్యం. నిబంధనల ప్రకారం ఒక జట్టు ఆతిథ్య దేశంలో ఆడేందుకు నిరాకరిస్తే ప్రత్యర్థి జట్టుకు వీకోవర్ పాయింట్లు లభిస్తాయనేది ఐసిసి నిబంధన. అదే జరిగితే గ్రూప్ ‘సి’లో ఉన్న వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లకు ఉచితంగా పాయింట్లు లభిస్తాయి. అంటే తెర లేవక ముందే బంగ్లాదేశ్కి ‘ఎగ్జిట్’ కార్డు పడ్డట్లే.
1996 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పట్లో శ్రీలంకలో తమిళ టైగర్స్ (ఎల్టిటిఇ) దాడుల వల్ల భద్రతా కారణాలవల్ల ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు కొలంబోలో ఆడేందుకు నిరాకరించాయి. దాంతో ఐసిసి ఆ రెండు జట్లు మ్యాచ్ పాయింట్లను శ్రీలంకకు కేటాయించడంతో శ్రీలంక గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలవడం, చివరికి విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే.
క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. క్రీడలకు రాజకీయాల్ని జోడించడం వల్ల బిసిబికి తమ నుండి రావాల్సిన వార్షిక ఆదాయంలో ఐసిసి కోత పెట్టవచ్చు. ఎందుకంటే ప్రతి బోర్డు కూడా టోర్నీ ప్రారంభానికి ముందే వారు ఆడే వేదికలపై అంగీకారానికి వచ్చినట్టు సంతకం చేస్తుంది. దాని తరువాత కేవలం యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వేదికల మార్పు ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఒకవేళ భారత్తో తమ మ్యాచ్లను ఆడకపోతే, క్రీడల్ని రాజకీయాల్లోకి చొప్పించినందుకు ఆ దేశ బోర్డుపై తాత్కాలిక సస్పెన్షన్ విధించే అధికారం కూడా ఐసిసికి ఉంటుంది. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టడం ద్వారా క్రీడాకారులు నష్టపోతారు. క్రికెట్ నష్టపోతుంది. అంతేకాదు ఆ జట్టు సంక్షోభంలో పడే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కానీ, ఆ దేశం కానీ, వారు తీసుకున్న నిర్ణయం ఏ మాత్రమూ అంగీకార యోగ్యం కాదు. రాజకీయాలకి అతీతంగా క్రీడలు నిలవాలి.
పి. చంద్రశేఖర్