Reading Time: 2 minutes

ఆటలు వేరు.. రాజకీయాలు వేరు అన్నది నిన్నటిమాట. క్రీడలే రాజకీయం, రాజకీయమే క్రీడలు అన్నది నేటి కలికాలపుమాట. రాజకీయజూదంలో క్రీడలు.. ప్రధానంగా క్రికెట్ ఓపావుగా మారిందనటానికి తాజానిదర్శనమే భారత్- బంగ్లా క్రికెట్ బోర్డుల పరస్పర బహిష్కరణల సయ్యాట!

క్రీడలు, క్రీడాస్ఫూర్తి అన్నమాటలను నిఘంటువుల నుంచి తొలిగించాల్సిన సమయం వచ్చింది. క్రీడల్లో రాజకీయాలు, రాజకీయాలలో క్రీడలు గత ఐదు దశాబ్దాలుగా సర్వసాధారణమయ్యాయి. వాస్తవానికి క్రీడలు స్నేహవారథులు. రెండు దేశాలు లేదా ప్రపంచ దేశాల నడుమ స్నేహసౌభ్రాతృత్వాలను పెంపొందించేవి క్రీడలు మాత్రమే. ప్రపంచ యుద్ధాలతో చెలరేగిన ఆశాంతి, శతృత్వం, అస్థిరత్వాలను రూపుమాపడం కోసం పుట్టుకువచ్చినవే ఒలింపిక్స్. కాలక్రమంలో ఒలింపిక్స్ నే అమెరికా కూటమి, సోవియట్ కూటమి దేశాలు బహిష్కరణల అస్త్రంతో రాజకీయం చేయటం అందరికీ తెలిసిందే. అయితే.. ప్రపంచీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయినా రాజకీయ మంటలకు క్రీడలు.. ప్రధానంగా క్రికెట్ ఓ సమిధగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో సర్వస్వతంత్రంగా ఉంటూ వచ్చిన క్రికెట్ ఆట వ్యాపార (బజారు) క్రీడగా మారిననాటి నుంచి బహిష్కరణల ఊబిలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. క్రికెట్ మర్యాదస్తుల క్రీడగా, పెద్దమనుషుల క్రీడగా కొనసాగినంతకాలం హుందాగానే సాగింది. సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు వన్డే క్రికెట్, దానికి తోకగా ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ తోడు కావడం, అదీ చాలదన్నట్లుగా ప్రపంచీకరణతో బహుళజాతి సంస్థల ప్రచార, ప్రసార వాహకంగా పరిణామం పొందటంతో క్రికెట్ వివిధ దేశాల అధినేతల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది.

ఇదే మొదటిసారికాదు..

ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం ( టెస్టు హోదా) కలిగిన మొత్తం దేశాలలో భారత ఉపఖండానికి చెందినవే సింహభాగం ఉన్నాయి. ప్రపంచ క్రికెట్ మూలవిరాట్టు భారత్ చుట్టే ప్రస్తుత క్రికెట్ ప్రపంచం పరిభ్రమిస్తోంది. భారత్ అంటే క్రికెట్..క్రికెట్ అంటే భారత్ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. దీనికితోడు భారత ఉపఖండంలోని దేశాల ప్రజలు క్రికెట్ ను ఓ భావోద్వేగాల సమరంగా భావించడంతో పాలకులు, ప్రభుత్వాలు మిగిలిన క్రీడల కంటే క్రికెట్ తోనే రాజకీయం చేయటం అనివార్యమయ్యింది.

భారత్ -శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరగాల్సిన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సైతం రాజకీయఅస్త్రంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ ల రాజకీయ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరడం, ఐపీఎల్ వేలంలో కోల్ కతా ఫ్రాంచైజీ 9 కోట్ల 20 లక్షల రూపాయల భారీ ధరతో దక్కించుకొన్న బంగ్లా పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తో కాంట్రాక్టు రద్దు చేసుకోడం పంతాలు, పట్టింపులకు దారితీసింది.

బంగ్లా బౌలర్ ను పక్కన పెట్టాలని కోల్ కతా ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎదురుదాడి మొదలుపెట్టింది. భారత్ వేదికగా తాము ఆడాల్సిన నాలుగు గ్రూపులీగ్ (కోల్ కతాలో మూడు, ముంబైలో ఒకటి ) మ్యాచ్ లను వేరే వేదికల్లో ఆడతామని, తమ జట్టు సభ్యుల భద్రత తమకు ప్రధానమని , ప్రస్తుత ఉద్రిక్తతల వాతావరణంలో తమ జట్టు ప్రశాంతంగా ఆడే పరిస్థితి లేదంటూ ఐసీసీని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. అంతేకాదు.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీకి ప్రధాన యాంకర్ గా ఉన్న భారత యువతి రిథీ పాఠక్ ను పక్కనపెట్టాలని తమ క్రికెట్ బోర్డుపై బంగ్లా ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. మరోవైపు భారత్ కే చెందిన జే షా నేతృత్వంలోని ఐసీసీ మాత్రెం బంగ్లా బోర్డు బెదిరింపులను కొట్టిపడేసింది. భారత్ లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ఉద్రిక్తతలకు తావేలేదని, భారత్ వేదికగా ఆడాల్సిన నాలుగు మ్యాచ్ లను బంగ్లా జట్టు ఆడకపోతే పాయింట్ల కోత తప్పదని ఘాటుగా హెచ్చరించింది. అంతర్జాతీయ క్రికెట్లో భద్రతాకారణాల సాకుతో బహిష్కరణ, బ్లాక్ మెయిల్ చేయడం ఇదే మొదటిసారికాదు. గతంలో శ్రీలంక, పాకిస్థాన్ వేదికలు ఆడాల్సిన సిరీస్ లు, మ్యాచ్ లను ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆ్రస్ట్రేలియాజట్లు రద్దు చేసుకొన్నాయి.

ముంబైలో పాక్ ఉగ్రవాదచర్యలతో పోరుగుదేశం పాకిస్థాన్ తో క్రికెట్ బంధాన్ని సైతం భారత్ తెంచుకొంది. పాకిస్థాన్ నిర్వహణలో జరిగిన 2025 మినీ ప్రపంచకప్ మ్యాచ్ లను పాక్ వేదికగా ఆడేది లేదని భారత్ తెగేసి చెప్పడంతో శ్రీలంకవేదికగా మ్యాచ్ లు నిర్వహించారు. బంగ్లా సైతం భారత్ మాదిరిగానే తాము శ్రీలంక వేదికగా మ్యాచ్ లు ఆడాతమంటూ నానాయాగీ చేస్తోంది. భారత్ లోని ప్రశాంత వాతావరణం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరుగనున్న ప్రపంచకప్ లో మిగిలిన దేశాలన్నీ పాల్గొనటానికి సిద్ధమైతే కేవలం బంగ్లాబోర్డు మాత్రమే రాజకీయం చేయటం ఏమాత్రం సమర్థనీయంకాదు. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుతో రాజకీయం చేస్తే భారీగా నష్టపోయేది బంగ్లాదేశ్ క్రికెట్ మాత్రమే.

 కృష్ణారావు చొప్పరపు