
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సత్తా ఏమిటో చూపారని, ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎ గురవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించాం, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టి గుండు సున్నాకు తీసుకువెళ్లాం. కం టోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఓడించాం. గ్రామ పంచాయతీల్లో మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించాం. ఇక, రాష్ట్రంలో మరో 8 సంవత్సరాలు మనమే అధికారంలో ఉండబోతున్నామని, అందువల్ల స్థానిక సంస్థల్లో మన పట్టు ఉంటేనే గల్లీలను అభివృద్ధి చేయగలుగుతామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిసిసి, పిఏసి విస్తృత స్థాయి సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పురపాలక ఎన్నికలు, పిబి జీరామ్ జీ పథకం,
తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కారణాలను పునః పరిశీలించి వాటిపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కేడర్‌కు ఆయన దిశానిర్ధేశం చేశారు. ప్రజా సమస్యల కోసం ఈ రెండేళ్లలో బిఆర్‌ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా తనవద్దకు వచ్చి నిధులు అడగలేదన్నా రు. వాళ్లకు రాజకీయ పదవులు కావాలే తప్ప ప్రజా సమస్యలపై పట్టింపు లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీతో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయని, కానీ, అధికారం ఉందని మోడీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుందామని బిజెపి ప్రణాళికలు చేసిందని, కానీ, ఆశించినన్నీ స్థానాలు రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారన్నారు. దీంతో వేరే రూపంలో ప్రజల హక్కులను కాలరాసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఈ దేశంలో ఇళ్లు, ఆస్తి లేని వారికి ఓటు హక్కు ఒక్కటే ఆయుధం అని, ఈ హక్కును తొలగించాలనే ‘సర్’ తెచ్చారన్నారు.
క్షమాపణ చెప్పే వరకు మోడీని వదిలేది లేదు
ఓటు హక్కు తీసేస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. చివరకు ఈ దేశంలో ఉండాలా లేదా అనే నిర్ణయం బిజెపి చేతిలోకి వెళ్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని, ఉపాధి పథకాన్ని మారుస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని నీరుగార్చడం కోసం గతంలో నల్లచట్టాలు తీసుకొస్తే నల్లచట్టాలు ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా జాతికి మోడీ క్షమాపణలు చెప్పేలా కాంగ్రెస్ చేసిందన్నారు. ఇప్పుడుకూడా ఉపాధి హామీ విషయంలో వదిలిపెట్టేది లేదన్నారు.
20 నుంచి గ్రామ సభల్లో తీర్మానాలు
పిబి జీరామ్ జీ చట్టం విషయంలో ఏఐసిసి నుంచి సంపూర్ణ కార్యాచరణతో ముందుకు వెళ్తామని సిఎం చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, ఇక రాష్ట్రంలోని 12,702 గ్రామాల్లో ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ లోపు గ్రామసభలు నిర్వహించి ఈ చట్టాన్ని తిరస్కరించేలా తీర్మానం చేయాలని సిఎం పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలు చేసే ఈ తీర్మానాలను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశాల్లోగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తీర్మానాల కాపీలను రాష్ట్రపతికి సమర్పించాలని సిఎం సూచించారు. ఈ తీర్మానం చేయడం గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‌ల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత కూడా ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు మినహా మిగతా 15 పార్లమెంట్ సెగ్మెంట్లకు మంత్రులను ఇన్‌చార్జులుగా పార్టీ పరంగా నియమించాలని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌లను సిఎం రేవంత్‌రెడ్డి కోరా రు. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక్కొక్కరూ ఒక్కో మండలం బాధ్యతలు తీసుకోవాలని, ముఖ్యమంత్రిగా తాను కూడా ఒక మండలం బాధ్యతను తీసుకుంటానని రేవంత్‌రెడ్డి తెలిపారు.
లక్ష మందితో భారీ బహిరంగ సభ
హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో ఫిబ్రవరి 3 నుంచి ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో విబిజీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిఎం పిలుపునిచ్చారు. సీతక్క నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించి సోనియా, రాహుల్, ప్రియాం క, ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు.