Reading Time: 3 minutes

మానసికోల్లాసాన్ని పెంచేవి క్రీడలు. క్రీడాకారులు, క్రీడాభిమానులు ఏ క్రీడ అయినా ఎంజాయ్ చేస్తారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆటను ఆస్వాదిస్తారు. అలాగే క్రీడలు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. అయితే క్రీడలలో ఎంత వద్దను కుంటున్నా.. రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. దీనికి ఆయా దేశాలలో ప్రభుత్వాలు, క్రీడానిర్వహణ సంస్థల వ్యక్తిగత అభిప్రాయాలు, భావోద్వేగాలు కారణం. ఫలితంగా క్రీడా స్ఫూర్తి దెబ్బతింటున్నది.

తాజాగా భారతదేశం – శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టి-20 క్రికెట్ వరల్ కప్ సందర్భంగా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో కొత్తవివాదం తెరపైకి వచ్చింది. తాము భారతదేశంలో ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ సంఘం నిరాకరించడంతో ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో ఆడాల్సిన ముస్తఫిజుర్ రహ్మాన్ ను తప్పించడం ఆ దేశానికి ఆగ్రహం కల్గించింది. ఉభయదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బంగ్లాదేశ్ ఈ విజ్ఞప్తి చేసినా, ఇక నెల్లాళ్లే గడువు ఉన్నందువల్ల ఈ సమయంలో బంగ్లాదేశ్ ఆడే అన్ని మ్యాచ్ ల వేదిక మార్చడం, ఖరారైన షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే, షెడ్యూల్ ప్రకారం క్రీడాకారులకోసం హోటళ్ల బుకింగ్, బంగ్లాదేశ్ తోపాటు, ప్రత్యర్థిజట్టుకు చేసిన ఏర్పాట్లు, టీవీ స్పాన్సర్ షిప్, వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన లావాదేవీలు వంటి ఎన్నో సమస్యల నేపథ్యంలో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.

వందలాది దేశాలు వందకు పైగా క్రీడాంశాలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించే ప్రపంచంలో అతి పెద్ద మహా క్రీడా సంబరం ఒలింపిక్స్. క్రీస్తుపూర్వం 420లో ప్రాచీన కాలంలో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ ను ఆధునిక కాలంలో పునరుద్ధరించాలను కోవడమే గొప్ప నిర్ణయం. 1920 నుంచి ప్రతి నాలుగేళ్లకు సజావుగా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అలాంటి ఒలింపిక్స్ కు కూడా రాజకీయ జోక్యం వల్ల బాయ్ కాట్ గ్రహణాలు తప్పలేదు. 1936 లో జర్మనీ యూదులను ఒలింపిక్స్ లో పాల్గొన కుండా నిరోధించింది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి కారణమని భావించిన జర్మనీ, జపాన్ దేశాలను ఒలింపిక్స్ లో పాల్గొనకుండా నిరోధించారు. 1964లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో గల విభేదాల కారణంగా ఇండోనేషియా, నార్త్ కొరియా బాయ్ కాట్ చేశాయి. జాతి వివక్ష పాటిస్తున్నందువల్ల 1972 ఒలింపిక్స్ లో రొడీషీయా (నేటి జింబాబ్వే) ను దూరం పెట్టారు.

1976 ఒలింపిక్స్ లో న్యూజిలాండ్ ను అనుమతించినందుకు చాలా ఆఫ్రికన్ దేశాలు పోటీలనుంచి వైదొలిగాయి. జాతి వివక్ష అనుసరిస్తున్న దక్షిణాఫ్రికా, రొడీషియాతో న్యూజిలాండ్ రగ్బీ మ్యాచ్ లలో పాల్గొడమే వారి ఆగ్రహానికి కారణం. 1980 లో అప్పటి యుఎస్‌ఎస్‌ఆర్ ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ కు నిరసనగా ఆస్ట్రేలియా, అమెరికా తో సహా పలు దేశాలు మాస్కో ఒలింపిక్స్ కు దూరంగా ఉండిపోయాయి. పలు దేశాలు 1980 మాస్కో ఒలింపిక్స్ ను బహిష్కరించినందుకు ప్రతీకారంగా యూఎస్‌ఎస్ ఆర్, తూర్పుజర్మనీతో సహా పలు దేశాలు 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ను నిషేధించాయి. ఇక 1988 లో సియోల్ ఒలింపిక్స్ ను చాలా దేశాలు బహిష్కరించాయి. దక్షిణాఫ్రికాను జాతి వివక్ష కారణంగా ఒలింపిక్స్ లోనే కాదు, క్రికెట్, ఫుట్ బాల్ తో సహా ఏ క్రీడలోనూ పాల్గొనకుండా ప్రపంచదేశాలు బహిష్కరించాయి. ఇలా.. ఆయా ప్రభుత్వాల విధాన పరమైన నిర్ణయాలు, రాజకీయాలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీశాయి. ఒలింపిక్స్ , ఫుట్ బాల్, క్రికెట్, రగ్బీ, కామన్వెల్త్ క్రీడలకు కూడా రాజకీయాలు, బహిష్కరణలు తప్పలేదు.

1947 లో దేశ విభజన తర్వాత భారత – పాకిస్తాన్ మధ్య క్రికెట్ రెండు దేశాల మధ్య క్రీడా స్ఫూర్తిని పెంచింది. భారత పాకిస్తాన్ మధ్య రెండు, మూడు యుద్ధాలు జరిగినా, క్రికెట్ పలు పర్యాయాలు రెండు దేశాల సంబంధాలను మెరుగుపరచేందుకు తోడ్పడింది. క్రికెట్ దౌత్యం అన్న పదానికి ఊతం ఇచ్చింది. 1987 ఫిబ్రవరిలో అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ జియాఉల్ హక్ జైపూర్ లో భారత- పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యారు. ఈ పర్యటన అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీతో భేటీకి దారి తీయడంతో పాటు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి దోహదపడింది. 15 ఏళ్ల విరామం తర్వాత 2004లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటించింది. రెండు దేశాలు వీసా నిబంధనలను సులభతరం చేయడంతో చాలా మంది ఆ దేశంలో పర్యటించి క్రికెట్ మ్యాచ్ లు చూశారు.

కార్గిల్ యుద్ధం, 2008 ముంబై టెర్రరిస్ట్ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా 2011 క్రికెట్ వరల్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్ ను మొహాలీలో తిలకించేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని యూసప్ రజా గిలానీని ఆహ్వానించడం, అతడు భారత పర్యటనతో రెండు దేశాల సంబంధాలపై ఆశలు చిగురించాయి. కానీ, ఆ తర్వాత పాకిస్తాన్ బారతదేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో రెండుదేశాల మధ్య క్రికెట్ సీరీస్ ప్రస్తావన లేకుండా పోయింది. బంగ్లాదేశ్ కు సంబంధించినంతవరకూ ఇప్పటి వరకూ ఎలాంటి పేచీ లేదు. 2024 లో బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు, తర్వాత అక్కడ జరుగుతున్న హింసాకాండ, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం ఏర్పడింది. భారతదేశంలో విదేశీ క్రీడాకారుల భద్రతకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. గతంలో ఎలాంటి భద్రతా పరమైన లోపం జరగలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు టి-20 వరల్ మ్యాచ్ లు ఆడేందుకు భారతదేశంలో పర్యటిస్తుందనే ఆశిద్దాం.

 పళ్లంరాజు మల్యాల