
వాషింగ్టన్: తన మాటను బేఖాతర్ చేస్తూ రష్యానుంచి చమురు కొం టున్న భారతదేశం, చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల పై 500శాతం సుంకాలు విధించేం ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్న ల్ ఇచ్చారు. ఈ అసాధారణ లక్ష్యం చైనా, భారత్‌లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఆపడమే. వైట్‌హౌస్‌లో బుధవారం ట్రంప్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగినట్లు సెనెటర్ లిండ్సే గ్రాహం తెలియజేశారు. ఈ సందర్భంగా కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్న ద్వైపాక్షిక రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఆపి శాంతి సాధించాలని ట్రంప్ కృషి చేస్తుంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ కేవలం మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ, మరో పక్క అమాయకులను చంపుతూనే ఉన్నాడు. పుతిన్ యుద్ధ యజ్ఞానికి ఆజ్యం పోస్తూ, చౌకగా రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించడానికి ఈ బిల్లు ట్రంప్‌నకు వీలు కల్పిస్తుందని
గ్రాహం బుధవారం ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా ప్రెసిడెంట్ కు చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలపై అసాధారణ ఆంక్షలు విధించే అధికారం లభిస్తుందన్నారు. వచ్చే వారం ప్రారంభంలోనే ఈ బిల్లుపై ద్వైపాక్షిక ఓటు కోసం ఎదురుచూస్తున్నట్లు గ్రాహం వెల్లడించారు. ట్రంప్ ఇప్పటికే భారతదేశంపై 50శాతం సుంకాలను విధించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. రష్యన్ ఇంధనం కొనుగోళ్లు చేస్తున్నందుకు అదనంగా 25శాతం సుంకాలు కూడా అందులో ఉన్నాయి. గ్రాహం, బ్లూ మెంటల్ 2025లో రష్యాను నిషేధించే చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు నిధులు సమకూరుస్తున్న దేశాలపై ద్వితీయ సుంకాలు విధించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రష్యన్ చమురు కొన్నా, శుద్ధి చేసి అమ్మినా, ఆదేశాలపై ఏకంగా 500 శాతం సుంకాలు విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. సెనెట్, విదేశీ సంబంధాల కమిటీలోని దాదాపు ప్రతి సభ్యుడు కో స్పాన్సర్ గా ఉన్నారు.
సుంకాలు తగ్గించాలని కోరిన వినయ్ క్వాత్రా
ఈ వారం ప్రారంభంలో అమెరికా లో భారత రాయబారి వినయ్ క్వాత్రా, భారతదేశం రష్యానుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకున్నట్లు తనకు తెలిపారని, భారతదేశం పై విధించిన సుంకాలు తగ్గించవలసిందిగా ట్రం పు తెలియజేయాలని కోరారని గ్రాహం చెప్పారు. ఆదివారం నాడు గ్రాహం , ట్రంప్ తో ఎయిర్ ఫోర్స్ వన్ లో వచ్చిన గ్రాహం తన సుంకం బిల్లు పై మాట్లాడారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విధించిన ఆంక్షలు రష్యా ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని గ్రాహం అన్నారు. భారతదేశం తన క్రూడాయిల్ ఉత్పత్తులలో 88 శాతం విదేశాలనుంచి కొనుగోలు చేస్తుంది. దీనిని పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. 2021 వరకూ భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం ముడిచమురులో రష్యా నుంచి దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. 2022 తర్వాత భారతదేశం రష్యానుంచి ముడిచమురు దిగుమతులు పెంచుకున్నా…. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ కంపెనీ కెస్లర్ ప్రకారం 2025 డిసెంబర్ లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రోజుకు దాదాపు 1.2 మిలియన్ బ్యారెళ్లు (బిపిడి) కు తగ్గినట్లు అంచనా. ఇది నవంబర్ లో 1.84 మిలియన్ బిపిడి గా ఉంది.