Reading Time: 2 minutes

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలన్న తన డిమాండ్‌ను పట్టించుకోకుంటే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మరోసారి హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. తాను సంతోషంగా లేనన్న సంగతి ప్రధాని మోడీకి బాగా తెలుసని, ఇప్పుడు తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. వెనెజులా చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకున్నామన్న జోష్‌లో ట్రంప్ భారత్ పై తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగించేందుకు రష్యా నుండి చమురు కొనుగోలు చేసే ఖాతాదారులపై కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకు రావాలన్నదే ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా బయటపడింది. భారత్ సహా రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాలపై 500% వరకు సుంకాలు విధించేందుకు వీలుగా బిల్లు తీసుకురావడానికి అమెరికా యోచిస్తోంది. భారత్ అమెరికా మధ్య కొన్ని నెలలుగా వాణిజ్యచర్చలు జరుగుతున్నా ఒప్పందం కుదరడం లేదు. ఒప్పందానికి చేరువగా ఉన్నామని భారత్ వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గత నెలలో ప్రకటించినా ఫలితం కనిపించడం లేదు.

తాజాగా ట్రంప్ హెచ్చరికపై భారత వాణిజ్య మంత్రిత్వశాఖ ఎలాంటి స్పందన చెందలేదు. వాణిజ్య రంగంపై దీని ప్రభావం కొద్దిగాపడింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్ ఇండెక్స్ (నిఫ్టిఐటి) రెండున్నర శాతం పడిపోయింది. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, లుకోయిల్ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించిన తరువాత రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం భారత్ పూర్తిగా ఆపలేదు కానీ కాస్త మందగింప చేసింది. భారత్‌లోని స్వదేశీ చమురు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర ఇతర కంపెనీలు రెండోసారి అమెరికా ఆంక్షలు తప్పించుకోడానికి తాము రష్యా నుంచి కొనుగోలు ఆపేస్తామని ప్రకటించాయి. అయినప్పటికీ రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గత నవంబరులో 35% వరకు పెరిగాయి. అలాగే అమెరికా నుంచి చమురు కొనుగోలు కూడా దాదాపు 13% పెరిగాయి. గత నవంబరులో రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి సగం వరకు ఉండడం విశేషం. గత నవంబరులో భారత్ రష్యా నుంచి 7.7 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోగా, 2024 నవంబర్ కన్నా 7 శాతం ఎక్కువ. అలాగే గత నవంబరులో అమెరికా నుంచి భారత్‌కు 1.4 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 2.8 మిలియన్ టన్నుల చమురు దిగుమతి అయింది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో అమెరికా చమురు దిగుమతుల వాటా 12.6% వరకు పెరగడం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. అయితే తాజాగా ట్రంప్ హెచ్చరికలపై భారత్ రష్యానుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపాలనుకుంటే అది స్పష్టంగా, నిర్ణయాత్మకంగా చేయవలసి ఉంది. ఆంక్షలు లేని రష్యా చమురు సంస్థల నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించాలనుకుంటే తన వైఖరి ఏమిటో స్పష్టమైన డేటాతోసహా బహిర్గతం చేయాలి.

ఆంక్షలు విధించినా ఆయా సంస్థల నుంచే చమురు కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంటే ఆ ఎంపికను కూడా భారత్ స్పష్టంగా చెప్పగలగాలి. అంతే తప్ప ఏమీ తెలియజేయని అస్పష్టత ఇకపై పనిచేయదని థింక్‌టాంక్ జిటిఆర్‌ఐ విశ్లేషణ సూచిస్తోంది. ఇదికాక రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే అమెరికా నుంచి ఒత్తిడి ఉండబోదన్న గ్యారంటీ భారత్‌కు ఏమాత్రం లేదు. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు గత మే నవంబరు నెలల మధ్య 20.7 శాతం తగ్గిపోయినప్పటికీ, అమెరికా నుంచి ముడి పెట్రోలియం, ఉత్పత్తులను మాత్రం భారత్ రెట్టింపు చేయడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. దీనిపై ఇంకా అదనంగా అమెరికా టారిఫ్‌లు బాగా విధిస్తే భారత్ వాణిజ్యం పతనావస్థకు చేరుకోవడం తథ్యం. ప్రస్తుతం అమెరికా విధించాలనుకుంటున్న అదనపు సుంకాల భారంతో రాజకీయాలు ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ తులనాత్మకంగా పరిశీలించడం అవసరం. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగకపోవచ్చు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపివేస్తే శాంతి లభిస్తుందన్న ఆశతో ఐరోపా యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు అమెరికా ఆంక్షలకు తలొగ్గుతున్నాయి.

కానీ ఆ దారిలోనే భారత్ ముందుకు వెళ్తే భారత్ సార్వభౌమాధికారాన్ని అమెరికా పాదాలకు తాకట్టుపెట్టినట్టే అవుతుందన్న వాదన వినిపిస్తోంది. భారత్ తనకు మిత్రదేశమని, ప్రధాని మోడీ మంచి మిత్రుడని అంటూ ట్రంప్ వీలు దొరికినప్పుడెల్లా భారత్‌ను అడకత్తెరలోపెట్టి అణగదొక్కుతున్నారు. భారత్‌పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం తలెత్తకుండా తానే ఆపగలిగానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్నా భారత్ గట్టిగా సమాధానం చెప్పలేకపోతోంది. పైగా పాకిస్థాన్‌కు ఆయుధ సాయం అందిస్తోంది కూడా. రొయ్యల మొలతాడు కట్టుకున్న పిల్లి శాంతి మంత్రం పఠించినట్టు ట్రంప్ కుతంత్రాలు హద్దులు మీరిపోయి ప్రపంచ దేశాల్లో అలజడి రేపుతున్నా భారత ప్రభుత్వం తన సందిగ్ధ, సామ్రాజ్యవాద అనుకూల వైఖరిని కొనసాగిస్తోందని దేశం లోని వామపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

అంతర్జాతీయ చట్టాలు, జాతీయ సార్వభౌమాధికారం, విదేశీ జోక్యం లేకుండా ప్రజలు తమ స్వంత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను నిర్ణయించుకునే హక్కును కాపాడుకోవడమే భారత్ తక్షణ కర్తవ్యం. ఈ మేరకు భారత్ తన గొంతును అంతర్జాతీయ వేదికలపై నిర్దంద్వంగా వినిపించగలగాలి. అలీన దేశాలతో, లాటిన్ అమెరికాతో గ్లోబల్ సౌత్‌తోపాటు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలతో భారత్ దృఢంగా నిలబడాలని దేశం లోని వామపక్షాలు సూచిస్తున్నాయి. బ్రిటిష్ పాలకులను ఎదిరించడానికి స్వాతంత్య్ర పోరాటం ఎలా సాగిందో అదే స్ఫూర్తి ఇప్పుడు అమెరికా వంటి రణదాహ అగ్రరాజ్యాలను ఎదిరించిప్పుడే భారత్‌కు సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది.