Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ నెల 8న కాంగ్రెస్ విస్తృ త స్థాయి సమావేశం జరుగనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చించే అంశాలు, ప్రస్తుతం అసెంబ్లీలో పలు అంశాలపై జరుగుతున్న చర్చలతో పాటు తాజా రాజకీయాలపై సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్ లో సుమారు అరగంట పాటు మంత్రులు, పిసి సి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో చర్చించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై మంత్రులకు, పిసిసి అధ్యక్షుడికి సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవాలని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దని, సమర్ధవంతులకే టికెట్‌లు కేటాయించాలని సూచించినట్టుగా సమాచారం. అ భ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని, సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే డిసిసి

అధ్యక్షులను నియమించుకున్నామని, కానీ, పూర్తిస్థాయిలో జిల్లాల కార్యవర్గాన్ని ప్రకటించలేదని అందులో భాగంగా ఈనెల 08వ తేదీన జరిగే కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో డిసిసి అధ్యక్షులందరూ పూర్తిస్థాయి కార్యవర్గానికి సంబంధించిన జాబితాను పిసిసి అధ్యక్షుడికి అందించాలని సిఎం రేవంత్‌రెడ్డి వారికి సూచించినట్టుగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అన్ని బిల్లులతో పాటు కృష్ణా జలాల పంపిణీ, హిల్ట్ పాలసీపై సభ్యులు సమర్ధవంతంగా చర్చించారని, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారని సిఎం మంత్రులను అభినందించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కల్వకుంట్ల కవిత మండలిలో మాట్లాడిన వ్యాఖ్యల వల్ల ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి కూడా సిఎం రేవంత్, మంత్రులు చర్చించినట్టుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున చేపట్టాల్సిన అంశాలు, వ్యూహాల గురించి సిఎం రేవంత్‌రెడ్డి 8వ తేదీన జరిగే సమావేశంలో ప్రకటించనున్నారు.ఈ సమావేశంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు, పార్టీ అభ్యర్థులు, డిసిసి కార్యవర్గం తదితర అంశాలకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించి ముందుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.