Reading Time: 3 minutes

మేక్ ఇన్ ఇండియా’ కేవలం ఒక నినాదమేనా? విదేశీ వస్తువులనేనా లేక విదేశీ మనషులను కూడా బహిష్కరిస్తారా? మరి మన భారతీయ విద్యార్థులు కూడా వివిధ దేశాల్లో చదువుతున్నారు, ఉద్యోగంలో స్థిరపడ్డారు. అక్కడ కూడా జాతి వివక్ష చూపి మన దేశస్థులను విచక్షణారహితంగా చంపడం లేదు. అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు మనలను కలవరపెడుతున్నాయి. కానీ విచిత్రంగా మన దేశంలో మన దేశస్థుడినే విదేశీయుడిగా భావించి వెంటపడి కిరాతకంగా దాడిచేయడం దారుణం. విదేశీయులకు ఆతిథ్యం ఇవ్వడంలో భారతీయులకు పెట్టింది పేరు. కానీ తోటి భారతీయుడిని కేవలం రూపురేఖలు చూసి విదేశీయుడిగా భావించి భారతీయులే దాడి చేయడం ఏ విధమైన భారతీయత? ఇది మన సంస్కృతికి పూర్తిగా భిన్నమైనది. విదేశస్థులయితే దాడికి పూనుకోవడమేనా? మనది ప్రజాస్వామ్యమా లేక అటవీక రాజ్యమా అనేది అందరూ ఆలోచించాల్సిందే.

డిసెంబర్ 9 నాడు 24 ఏళ్ల ఏంజెల్ చక్మా అనే త్రిపురకు చెందిన ఎంబిఎ విద్యార్థి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో తన సోదరుడు మైకేల్ చక్మాతో పాటుగా షాపింగ్ చేస్తుండగా స్థానికులు కొందరు (మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం) అతడి పౌరసత్వాన్ని, కులాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు అభ్యంతరం తెలిపిన చక్మాపై కత్తులతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. డెహ్రాడూన్ ఆసుపత్రిలో 16 రోజులపాటు మృత్యువుతో పోరాటం సలిపి చివరికి చక్మా దానికి లొంగిపోయాడు. తన తుది శ్వాస విడిచాడు. అతడి వెన్నెముక, తలపైన తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అక్కడి ఎస్‌పి పేర్కొన్నాడు. కేసుకు సంబంధించి ఇద్దరు మైనర్లను అరెస్టు చేసి జువెనైల్ హోం కు తరలించారు. ఒకరు మణిపూర్‌కు చెందినవారు కాగా, మరొక నిందితుడు నేపాల్ కు చెందినవాడు. చనిపోయే ముందు చక్మా చివరి మాటలు ‘నేను చైనీయుడను కాదు భారతీయుడనే’ అని చెప్పుకోవలసి రావడం దురదృష్టకరం. ఉన్నత చదువు కోసం ఉత్తరాఖండ్ వెళ్లి పట్టాతో తిరిగి వస్తాడు అనుకున్న కొడుకు శవపేటికలో ఇంటికి చేరుకోవడం ఆ తల్లిదండ్రులకు అంతుబట్టని ఆవేదనను ఆక్రోశాన్ని మిగిల్చింది.

‘సెవెన్ సిస్టర్స్’ అని పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. ఈ ఏడు రాష్ట్రాలకు కొంత మేరకు వారి ఉనికి, ఆచార వ్యవహారాల దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. వారి రూపురేఖలు, వేషభాషలు సరిహద్దు దేశాలతో పోలి ఉండడం కూడా గమనార్హం. అంతేకానీ వారు భారతీయులు కాకపోరు. వారిని ‘చింకీ’లని ‘చైనీయు’లని బనాయించడం వేధించడం సబబు కాదు. మరో ప్రక్క ప్రధానమంత్రి మోడీ చైనాతో సత్సంబంధాలు నెరపుతూ రెండు దేశాలు ఉమ్మడిగా అమెరికా అధిపత్యాన్ని ఎదుర్కోబోతున్నాయని ప్రకటించడం సంతోషం. కానీ కేవలం చైనీయుల పోలికలున్న వ్యక్తులపై ముఖ్యం గా భారతీయులపైనే వారిని విదేశీయులుగా భావించి వేధించి దాడి చేయడం దుర్మార్గం. పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించదగిన విషయం.

ఎందుకు ఈ విద్వేషాలు? రంగుని, రూపాన్ని చూసి జాతిని నిర్ణయిస్తారా? కనీసం అతడి గుర్తింపు గురించిన ప్రశ్నలేవీ లేకుండానే దాడి చేయడం ఏ రకమైన నాగరికత? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బిజెపికు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ రాష్ట్రాన్ని దైవభూమిగా కూడా చెప్పుకుంటున్నాం. కానీ అలాంటి పవిత్ర భూమిలో ఇంత మానవీయంగా, అనాగరికంగా ఒక విద్యార్థిపై పాశవికంగా దాడి చేయడం హేయమైనది. కేసు ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు. నిత్యం నీతులు వల్లించే పార్టీ అధికారంలో ఉండి తమ పౌరులకు ఏమి నేర్పుతున్నది? దీనిని ఒక చిన్న సంఘటనగా లేక ఒక యాదృచ్ఛికమైన సంఘటనగా మాత్రమే చూడలేము. దీనిలో ఎంతో విద్వేషం దాగి ఉంది. వివక్ష లేని సమాజం ప్రభుత్వాల ఆశయం కావాలి. కానీ జాతి వివక్షల పేరుతో ఉన్నత విద్యను అభ్యసించడానికి సుదూర ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థిపై దాడులు జరగడం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటనగా చూడాలి.

గ్లోబలైజేషన్ నేపథ్యంలో దేశాలకు ఎల్లలు, సరిహద్దులు చెదిరిపోయాయి. చట్టబద్ధమైన పత్రాలతో ఎవరు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయవచ్చు. కానీ మన దేశంలోనే మన పౌరుడు ఇతర రాష్ట్రాలకు వీసాలు, పాస్‌పోర్టులతో వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయా అనేది సామాన్యుడి సందేహం. ఈ విధమైన దాడులు దేశంలోని ఇతర పౌరులకు ఏ రకమైన సందేశాన్నిస్తున్నాయి? ఇది జాతి సమగ్రతకు ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు జాతి సమైక్యతకు భంగకరం. అసలు కేంద్రంలోని బాధ్యులు కానీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర బాధ్యులు కానీ పెద్దగా స్పందించకపోవడం లేదా విచారణకు ఆదేశించకపోవడం దేశపౌరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ విధమైన వివక్షతో కూడిన విద్వేషాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించవా అనేది సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు. భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాబోవన్న విశ్వాసం మన ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరం. ఇది కచ్చితంగా ప్రభుత్వాల నిర్లక్ష్యంగానే పరిగణించవలసి వస్తున్నది.

ఏంజెల్ చక్మా తండ్రి సైన్యంలో పనిచేస్తున్నాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామీ 16 రోజుల తర్వాత తండ్రికి ఫోన్ చేసి పరామర్శించడం ఎంత బాధ్యతారాహిత్యం? దేశ సేవకు అంకితమైన వారి కొడుకులకు కూడా ఈ దేశంలో వివక్ష తప్పదా? వారు కూడా విద్వేషానికి అతీతులు కారా? దేశ రక్షకుడి కుమారుడికి ఈ దేశం రక్షణ కల్పించలేకపోవడం శోచనీయం. అసలు దాడి కేసు విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి లేదా ఎఫ్‌ఐఆర్ బుక్ చేయడానికి వెనుకాడడం బాధితులకు అన్యాయం చేయడానికేనా? ప్రజల నుండి నిరసన వెల్లువెత్తిన తర్వాత కేసు బుక్ చేయకపోవడం అత్యంత దుర్మార్గం. దేశ పౌరులమని చెప్పుకోవడానికి అనునిత్యం గుర్తింపు కార్డు దగ్గర పెట్టుకుని తిరగాలా? మొహానికో లేక మెడకో బోర్డులు వేలాడదీసుకోవాలా? ఇలాంటి చర్యలు దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేస్తాయా లేక మరింత దిగజార్చుతాయా? బిజెపి పాలిత రాష్ట్రాల్లో సత్వర న్యాయం అందుబాటులో లేదని మరోసారీ నిరూపితమైంది. భారతదేశంలో ఏకత్వానికి ప్రతీక. జాతులు, మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలకతీతంగా ప్రజలు ఏకత్వాన్ని ప్రదర్శిస్తూవచ్చారు. వివక్ష, విద్వేషాలకు తావులేని భూమి ఇది. భారతీయ సంస్కృతి ఎన్నో రకాల ప్రజలను కట్టిపడవేస్తున్నది. కానీ విద్వేష విత్తనాలు నాటుతూ వాటిని మహావృక్షాలుగా పెంచి పోషిస్తున్న శక్తులకు అంతులేకుండాపోతున్నది. వీటిని మొగ్గ దశలోనే తుంచి వేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. లేదంటే అవి విషవృక్షాలుగా మారి జాతి ఏకత్వాన్ని ఔన్నత్యాన్ని పెకిలించి వేసే ప్రమాదం లేకపోలేదు.

బంగ్లాదేశ్‌లో చంపబడుతున్న హిందువుల పరిస్థితి ప్రతిరోజు చదువుతున్నాం. ఈ విషయమై కేంద్రంలో ఇంకా సరైన చలనం లేదు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా తన అంతర్భాగంగా చూపించుకుంటున్నది. కశ్మీర్ రాష్ట్రానికి పాకిస్తాన్ నుండి ఎప్పుడు ఒక ప్రమాదం పొంచి ఉంది. సరిహద్దు రాష్ట్రాలకు సరిహద్దు దేశాలతో ప్రమాదం సహజమే. ఈ విధమైన పరిస్థితుల్లో మన రాష్ట్రాలను ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను ఆ ప్రజలను రక్షించుకోవలసిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేష బీజాలు, ద్వేషభావాలు మొలకెత్తకుండా చూడాలి. దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టాలి, కాపాడాలి కొనసాగించాలి. దేశసమగ్రతకు భంగం కలిగించే ఏ రకమైన విద్వేషాలు పెరగకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి.  

  శ్రీశ్రీ కుమార్