Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితులైన ఉమర్‌ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (.జెఎన్‌యు)లో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా దేశ వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. దీన్ని ఎబివిపి విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ నిరసనలను తప్పుపడుతూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల మధ్య సంఘర్షణ వాతావరణం తలెత్తింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఆధారాలున్నాయి కాబట్టి నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వలేదని జేఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు వైభవ్ మీనా పేర్కొన్నారు.

ఈ రకమైన నిరసనలు భారత న్యాయవ్యవస్థను కించపర్చడమేనని వ్యాఖ్యానించారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో జెఎన్‌యు విద్యార్థి నేత అదితి మిశ్రా ప్రతిసంవత్సరం తమ యూనివర్శిటీలో ఢిల్లీ దాడుల్ని ఖండిస్తూ నిరసన తెలియజేస్తామన్నారు. ఇప్పుడు జరిగిన నిరసనలు సిద్ధాంతపరంగా సాధారణంగా జరిగే నిరసనలే అని, ప్రత్యేకించి ఏ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉద్దేశించినవి కావని ఆమె వివరించారు.

మోడీ, అమిత్‌షాలపై వ్యతిరేక నినాదాలు

విద్యార్థులు కొందరు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై యూనివర్శిటీ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో దృశ్యాలు వైరల్ కావడంతో యూనివర్శిటీ యంత్రాంగం స్పందించింది. అభ్యంతరకరమైన నినాదాలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనివర్శిటీలు ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు కేంద్రాలుగా ఉండాలి తప్ప ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే లాబొరేటరీలు కాకూడదని హెచ్చరించారు. బాధ్యులైన వారిని తక్షణం సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించడం లేదా శాశ్వతంగా డిబార్ చేయడం తప్పదని హెచ్చరించారు.