Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఒక ఫ్లాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. మృతులను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నలింగ్ అండ్ టెలికాం)గా పనిచేస్తున్న అజయ్ విమల్ (45).ఆయన భార్య నీలమ్ (38) . వాని 10 ఏళ్ల కుమార్తె జాహ్నవిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ నగరం, ఆదర్శ్‌నగర్ ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అజయ్ విమల్, తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి జాహ్నవి అనే 10 ఏళ్ల కుమార్తె ఉంది. అజయ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో వారింట్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్‌లో తీవ్రమైన గాయాలతో అజయ్ కుటుంబం కనిపించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా వారు మరణించారు. మంటలను ఆర్పేటప్పుడు అగ్నిమాపక సిబ్బందిలోని రమేశ్ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీటిని వేడి చేసేందుకు పెట్టిన హీటర్ షార్ట్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.