Reading Time: < 1 minute

కోల్‌కతా: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్‌ను ఈసీ చట్టవిరుద్ధంగా వినియోగిస్తోందని ఆరోపించారు. గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సాగర్ ఐలాండ్ లో తన రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సంఘం రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామిక వ్యతిరేక, తప్పుడు పద్ధతులను అవలంబిస్తోందని ఆరోపించారు. అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తోందని, అర్హులైన ఓటర్లను చనిపోయినట్టుగా చూపిస్తోందని, దీనికోసం బీజేపీ యాప్‌ను వాడుతోందని మమత మండిపడ్డారు. ఇలా సాగడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఇవన్నీ నిరాధారం, రాజకీయ ప్రేరితమైనవని కొట్టి పారేసింది.