Reading Time: < 1 minute

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని ఊహించలేదని, చివరకు వారు కూడా పార్టీలోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని, హైదరాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతున్నానని ఆయన చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం కలుగుతుందన్నారు. మరోసారి పార్టీ పెద్దలు పునరాలోచించాలని ఆయన కోరారు.

రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు తనకు ఇష్టం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమేనని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని జిల్లా స్వరూపం మాత్రం మారొద్దని ప్రభుత్వాన్ని మల్‌రెడ్డి కోరారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగిందన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదన్నారు. ఫార్మాసిటీపై పోరాటం చేసినందుకే గతంలో తనను కెసిఆర్ ఓడగొట్టారని మల్‌రెడ్డి చెప్పారు. నాటి ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఫార్మాసిటీ వచ్చి ఉంటే 50 కిలోమీటర్ల మేర కాలుష్యం ఎక్కువ అయ్యేదన్నారు.