Reading Time: < 1 minute

ఖాట్మండ్: హిమాలయ దేశం నేపాల్‌లో ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. నేపాల్‌తో సరిహద్దును మూసేసింది. ఎవర్జెన్సీ సేవలు మినహా సీమాంతర కదలికలపై ఆంక్షలు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధనుశా జిల్లాలో ఓ ప్రార్థనా మందిరాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఆందోళనలు చెలరేగాయి. పర్సా, రాహౌల్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫూ విధించింది.