
బొగొటా: మదురో నిర్బంధం తరువాత లాటిన్ అమెరికా లోని మెక్సికో, క్యూబా, కొలంబియాలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ట్రంప్ … పద్ధతి మార్చుకోకపోతే వెనుజువెలా పరిస్థితే ఎదుర్కోవాలి వస్తుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. “ నన్ను తీసుకెళ్లండి. ఇక్కడే మీకోసం ఎదురు చూస్తున్నా” అంటూ గతంలో మదురో సవాల్ విసిరినట్టుగానే వ్యాఖ్యానించారు. వెనెజువెలాపై దాడిని తీవ్రంగా ఖండించిన పెట్రో.. కొలంబియాపై అమెరికా సైనికచర్య చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. “తమ రైతులపై ( అమెరికా ) బాంబులు వేస్తే .. పర్వత ప్రాంతాల్లో వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారు.
దేశంలో అనేక మంది అభిమానించే అధ్యక్షుడిని నిర్బంధిస్తే , ప్రజల ఆగ్రహానికి గురవుతారు ” అని అన్నారు. ఆయుధాన్ని పట్టుకోనని, గతంలో ప్రమాణం చేశానని, అయితే మాతృభూమి కోసం అవసరమైతే వాటిని మళ్లీ చేపడతానన్నారు. 1990 కి ముందు ఆయన గెరిల్లా పోరాటంలో పనిచేశారు. బెదిరింపులు , బలప్రయోగం అనేవి అంతర్జాతీయ సంబంధాల్లో ఆమోద యోగ్యం కాదని, చర్చలు , సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కొలంబియా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. హింస, బలప్రయోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది.