
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి జనవరి 12న సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ కు సిబీఐ నోటీసులు జారీ చేసినట్లు మంగళవారం నాడు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ ప్రశ్నించిందని వారు తెలిపారు. తొక్కిసలాట కేసుకు సంబంధించి విజయ్ ను ప్రశ్నించాలని సిబీఐ ఇప్పుడు నిర్ణయించింది. ఆ తర్వాత ఈ విషయంలో చార్జిషీటు దాఖలు పై నిర్ణయం తీసుకోవచ్చునని అధికారవర్గాలు తెలిపాయి.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ , రాష్ట్ర సిట్ నుంచి ఈ కేసును చేపట్టింది. తమిళనాడు లోని కరూర్ లో 2025 సెప్టెంబర్ 27న విజయ్ ప్రసంగించిన రాజకీయ సమావేశంలో జరిగిన తొక్కసలాటకు సంబంధించి సిబిఐ ఆధారాలను సేకరిస్తోంది. ఈ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
కరూర్ దుర్ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని టివికే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించి, ఈ కేసును సిబీఐకి అప్పగించింది.అక్టోబర్ లో , దర్యాప్తును చేపట్టడానికి సీనియర్ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ను ఆదేశించింది. సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల పర్యవేక్షణ కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది.సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా పౌరుల మనసులలో ఓ ముద్ర వేసిందని జస్టిస్ జె.కె. మహేశ్వరి,జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇది విసృ్తత ప్రభావాలను చూపుతుందని, తమ బంధువులను కోల్పోయిన కుటుంబాల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, అత్యంత ముఖ్యమైందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పోలీసుఉన్నతాధికారులు ఈ సంఘటన తీవ్రతను
పట్టించుకోకుండా మీడియా ముందు యథేచ్ఛగా వ్యాఖ్యలు చేశారని ధర్మాసనం గుర్తించింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, విచారణ జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలలో కల్పించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ అంశం పౌరుల ప్రాథమిక హక్కులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని గుర్తు చేస్తూ, న్యాయమైన దర్యాప్తు పౌరుడి హక్కు అనడంలో ఎలాంటి సందేహం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.