
న్యూఢిల్లీ: నెలకు రూ.15,000 వేతనం మించినవారిని కూడా ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత 11 ఏళ్లుగా పరిమితిని సవరించలేదని, అందువల్ల రూ. 15,000 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఈ పథకం కింద సామాజిక భద్రత ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నవీన్ ప్రకాశ్ నౌతియాల్ అనే ఉద్యమకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎసి చందూర్కర్‌ల ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టి ఆదేశాలు వెలువరించింది. “ చాలా ఏళ్లుగా వేతన పరిమితిని పెంచలేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనాలు రూ.15,000 కంటే ఎక్కువే ఉన్నాయి. దీంతో చాలా మందికి ఈపీఎఫ్‌వో లబ్ధి లభించడం లేదు.” అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. నిర్ణీత కాలవ్యవధి లేకుండా పరిమితిని అప్పుడుప్పుడు సవరిస్తున్నారని ఒక్కోసారి 1314 ఏళ్లు పడుతోందని చెప్పారు. సమానత్వ హక్కులకు అనేక మంది దూరమవుతున్నారని చెప్పారు. తమ ఉత్తర్వుతో కలిపి ఈ అంశాన్ని పిటిషనర్ రెండు వారాల్లో కేంద్రానికి విన్నవించాలని , దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది.