Reading Time: < 1 minute

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ఏ7గా ఉన్నాడు. న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది.

కాగా, గతేడాది డిసెంబర్ లో ఈగల్ టీమ్ కు పట్టబడిన డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో అమన్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వారి నుంచి అమన్ పలుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశాడని..ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. దీంతో అమన్ పై మాసబ్‌ ట్యాంక్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దీంతో అమన్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసుకు ముందు కూడా నార్సింగ్ లో పట్టుబడిన డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో అమన్ కు సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు.. అతనికి పరీక్షలు చేసి డ్రగ్స్ వాడినట్లు తేల్చారు.