Reading Time: < 1 minute

రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోపీలో కరీంనగర్‌కు చెందిన అమన్ రావు చెలరేగిపోయాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన అమన్.. చివరి బంతి వరకూ బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ రాహుల్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కి 104 పరుగులు జోడించాడు. 65 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్న అమన్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వేగం అందుకున్నాడు.

నిలకడగా ఫోర్లు, సిక్సులు బాదుతూ వచ్చాడు. మరో వైపు వికెట్లు పడుతున్నా.. తను మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 108 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత వేగంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. మరో 46 బంతుల్లోనే డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 49వ ఓవర్‌లో 185 పరుగులతో ఉన్న అమన్ ఆకాశ్‌దీప్ వేసిన చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బాల్‌కు రెండు పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది డబుల్ సెంచరీ చేశాడు.

353 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. టాప్-4 బ్యాటర్లు సుమిత్ నాగ్(10), ఈశ్వరన్(15), సుదీప్ (0), కరణ్ లాల్(13) విఫలమయ్యారు. ఈ దశలో షాబాజ్ అహ్మద్ (108), అనుస్తుప్ మజుందార్ (59) జట్టుకు విజయాన్ని అందించాలని పోరాడారు. కానీ, వీరిద్దరి పోరాటం సరిపోలేదు. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లతో బెంగాల్ పతనాన్ని శాసించాడు. నితీశ్ రెడ్డి2, చామ మిలింద్, రక్షణ రెడ్డి, నితిన్ సాయి యాదవ్, ప్రణవ్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారెు. దీంతో బెంగాల్ 44.4 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.