Reading Time: < 1 minute

 సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ ఉద్యమ కారుల జెఎసి నాయకులు ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కవితకు సంఘీభావం తెలిపేందుకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యమకారులు జాగృతి కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ కవిత అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కోసం కవిత ఆధ్వర్యంలో

రాబోయే పార్టీకి తమ మద్దతు ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికులు,హెచ్‌ఎంఎస్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బిసి సంఘం, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు, తొలి, మలి దశ ఉద్యమకారుల జెఎసి, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జెఎసి, తెలంగాణ పొలిటికల్ జెఎసి, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సంఘాలు, కుల సంఘాల నాయకుల బాధ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కవితను కలిసిన వారిలో ఉన్నారు. తనపై నమ్మకంతో ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం పోరాటం ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతిలో నడిచే తమకు అందరూ మద్దతివ్వాలని కవిత కోరారు.