
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న రియల్ ఎస్టేట్ దురాశను తీర్చడం కోసం విద్యాసంస్థల భూములను కబళించడం అత్యంత హేయమైన చర్య అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఎఎన్‌యుయు)కి చెందిన 50 ఎకరాల భూమిని లాక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో రాహుల్‌గాంధీకి కనీసం అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు. విద్య, మైనారిటీల పక్షాన నిలబడతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా..? అని నిలదీశారు. విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటిని నాశనం చేసేలా వ్యవహరించడం సమర్థనీయం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య అనేది కేవలం ఒక రాజకీయం కాదని, అది దేశ భవిష్యత్తు అని స్పష్టం చేశారు.
గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో పచ్చని అడవిని బుల్డోజర్లతో కూల్చివేసి, వన్యప్రాణులను పొట్టనబెట్టుకోవడం ద్వారా సిఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చారని గుర్తు చేశారు. ఆ అవమానకర ఘటన నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లు, భవిష్యత్ కోర్సుల కోసం కేటాయించిన భూమిని లాక్కోవడం అంటే వేలాది మంది విద్యార్థుల ఆశయాలను సజీవ దహనం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై బిఆర్‌ఎస్ పార్టీ మౌనంగా ఉండబోదని, ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలుస్తామని కెటిఆర్ ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని తెలిపారు. ప్రజల మధ్య, న్యాయస్థానాల్లోనూ ఈ అన్యాయంపై రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యం అని కెటిఆర్ పునరుద్ఘాటించారు.