Reading Time: < 1 minute

సిడ్నీ: యాషెస్, 2025-26లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇఫ్పటికే సిరీస్‌ని 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు చివరి టెస్ట్‌పై కూడా కన్నేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 384 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ని ఆస్ట్రేలియా దూకుడుగా ఆరంభించింది. ట్రావిస్ హెడ్ అవధులు లేకుండా విజృంభించాడు. మరోవైపు వెదర్లాడ్(21) కాస్త నిరాశపరిచినా.. లబుషేన్(48) అర్థ శతకానికి చేరువలో ఔట్ అయ్యాడు. నెసర్ (24) ఫర్వాలేదనిపించాడు. ఇక హెడ్ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ బ్యాటింగ్ చేశాడు. 105 బంతుల్లో సెంచరీ సాధించిన హెడ్ మరో 47 బంతులు ఎదురుకొని 150 పరుగుల మార్క్‌ని చేరుకున్నాడు. మొత్తంగా 166 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 163 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఇక హెడ్ వికెట్ తర్వాత ఇంగ్లండ్ పట్టుబిగిస్తుందని అంతా భావించారు. కానీ, స్టీవ్ స్మిత్ ఆ అవకాశం ఇవ్వలేదు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. 167 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. టెస్టుల్లో ఇది స్మిత్‌కి ఇది 37వ సెంచరీ.. యాషెస్‌లో 13వ సెంచరీ కావడం విశేషం. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 124 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 518 పరుగులతో 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో స్మిత్ 129, వెబ్‌స్టర్ 42 ఉన్నారు.