
హైదరాబాద్: ఈవి వాహనాల బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈవి పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈవి వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు ఉంటాయన్నారు. మంగళవారం శాసనమండలిలో పొన్నం ప్రసంగించారు. ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం అని.. ఉద్యోగులు ఈవి వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఉంటుందని పొన్నం తెలియజేశారు. ఉద్యోగులకు 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరామని అన్నారు. ఎంఎన్ సి కంపెనీలు ఈవి వాహనాలు కొనుగోలు చేసేలా విధానం ఉంటుందని, పిఎం ఈ డ్రైవ్ కింద 575 ఆర్టిసి బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. కొత్తగా 200కు పైగా ఈవి బస్సులు వస్తున్నాయని, వరంగల్ లో 100, నిజామాబాద్ లో 50 బస్సులు వస్తున్నాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని, స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జివో తీసుకువచ్చామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.