
హైదరాబాద్: హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తూన్నామని అన్నారు. మంగళవారం శాసనమండలిలో శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఉబెర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. త్వరలో ఏర్పాటు చేస్తుందని, కాగ్నిజెంట్ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేశారు. పోచారం ఇన్ఫోసిస్ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మంది ఉపాధి, విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5 వేల మందికి ఉపాధి ఉంటుందని అన్నారు. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కొనియాడారు. ఇప్పటికే 70 జిసిసిలు రాష్ట్రానికి వచ్చాయని.. సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జినోమ్ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయిందని, ఐటీ కంటే ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు. ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.