Reading Time: < 1 minute

ప్రసారాలను నిలిపివేస్తామని బంగ్లా ప్రభుత్వం ప్రకటన

ఢాక: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ ఐపిఎల్ 2026 సీజన్ ఆడకుండా నిషేధం విధించడంపై బంగ్లా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ దేశంలో ఐపిఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు ఐపిఎల్ ఆడకుండా నిషేధం విధించాలని భారత్ వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతున్న తరుణంలో బిసిసిఐ ముప్తాఫిజుర్‌పై వేటేవేసింది. ఐపిఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కోల్‌కతా టీమ్.. అయితే, బిసిసిఐ ఆదేశాలతో అతన్ని రిలీజ్‌చేసింది. ఈ చర్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది.

భారత క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటో తెలియదు. కానీ ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను అవమాన పరిచిట్టైంది. ఈ పరిస్థితుల్లో.. తదుపరి నోటీసు వచ్చే వరకు ఐపిఎల్ ప్రసారాలను నిలిపివేయాలి అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో పేర్కొంది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. తమ మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసిసికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బిసిబి) విజ్ఞప్తి చేసింది. బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆ జట్టు మ్యాచ్లను శ్రీలంకకు తరలించే అవకాశం ఉంది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.