Reading Time: 2 minutes

వెనిజులాపై అమెరికా దురాక్రమణ చర్య కేవలం అక్కడి చమురు, ఖనిజ వనరులను దోచుకోవడానికే అన్నది వాస్తవం. ఈ చర్యతో పశ్చిమార్ధగోళ కూటమికి ఆధిపత్యం వహించాలనే దురాలోచనతో ట్రంప్ తరువాతి వంతు మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలదేనని హెచ్చరించడం అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష పరాకాష్టకు దారితీస్తోంది. చైనా, రష్యా, భారత్ వంటి పోటీదారులను నిరోధించడానికి, మార్కెట్లు, సహజ వనరులపై నియంత్రణ సాధించాలన్న అమెరికా లక్షం కనిపిస్తోంది. సహజ వనరులు అపారంగా ఉన్న లాటిన్ అమెరికాలోని వామపక్ష ప్రభుత్వాలను కూలదోయడం, అక్కడ తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి ఎత్తుగడలు పన్నడం అమెరికా సామ్రాజ్యవాద కాంక్షగా సాగుతోంది. ఈ దాడి ఐక్యరాజ్యసమితి నిబంధనలను, అంతర్జాతీయ చట్టాలను, ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే అవుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వెనెజులాలో 303 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు నిక్షేపాల్లో ఇది అయిదో వంతు. అదే అమెరికా, రష్యాలో చెరి 80 బిలియన్ బ్యారెళ్లు ఉండగా, సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి.

వెనిజులాలో చమురును శుద్ధి చేయడానికి ఖర్చు చాలా తక్కువ. అందుకనే అమెరికా వెనిజులాను స్వాధీనం చేసుకోవడానికి దాడి చేసింది. అయితే అత్యధికంగా చమురు నిల్వలు వెనెజులాలో ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి వెనెజులాకు లేకపోవడం చాలా లోపం. ఫలితంగా చమురు పరిశ్రమలు అనేక సంవత్సరాలుగా సంక్షోభంలో అల్లాడుతున్నాయి. సరైన నాయకత్వం లేకపోవడం, అవినీతి, అమెరికా ఆంక్షలు, పరిశ్రమ లోకి పెట్టుబడులు రాకపోవడం ఇవన్నీ వెనెజులాను పట్టిపీడిస్తున్నాయి. ఈ కారణాల వల్ల 25 ఏళ్ల క్రితం రోజుకు మూడు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసే వెనెజులా ప్రస్తుతం ఒక మిలియన్ బ్యారెళ్ల స్థాయికి పడిపోయింది. ఈ విధంగా ఉత్పత్తి చేసే చమురులో సింహభాగం అంటే రోజుకు 6,00,000 బ్యారెళ్లను చైనా దిగుమతి చేసుకుంటోంది. వెనెజులాను ఆర్థికంగా చైనా ఆదుకుంటోంది. చమురు రంగంలో ముమ్మరంగా పెట్టుబడులను పెట్టింది. రష్యా చమురు కూడా దాదాపు వెనెజులా ముడిచమురు మాదిరిగానే ఉండడంతో భారత్, చైనా లాంటి దేశాలు రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వెనెజులాలో ఉత్పత్తి పెరిగితే అది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారై, ఇప్పటి దాకా రష్యా దగ్గర ముడిచమురును కొంటున్న దేశాలు క్రమంగా వెనెజులా వైపు మొగ్గు చూపుతాయని, దీనివల్ల రష్యా ఆర్థికంగా దెబ్బతినడమే కాక, ఉక్రెయిన్‌పై యుద్ధంచేసే సామర్థాలు రష్యాకు తగ్గుతాయని అమెరికా ఆలోచిస్తోంది. ఆమేరకు రష్యాను కట్టడి చేయవచ్చని అమెరికా ఎత్తుగడ.అంతేకాక, ప్రపంచం లోనే అత్యధికంగా రోజుకు 2022 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, వెనెజులాలో తయారయ్యే రకం చమురును అమెరికా కొంతవరకు దిగుమతి చేసుకుంటోంది.

అమెరికా తయారు చేసే లైట్ స్వీట్ రకం ముడిచమురు పెట్రోల్ వంటి వాటి తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. డీజిల్‌తోపాటు ఫ్యాక్టరీలు ఇతర అవసరాలకు కావలసిన ఉత్పత్తులను తయారు చేయాలంటే వెనెజులా సరఫరా చేసే హెవీ, సోర్ రకం ముడిచమురు ముఖ్యం.అనేక అమెరికన్ రిఫైనరీలు వెనెజులా హెవీ ఆయిల్‌ను ప్రాసెస్ చేయడానికి అనువుగా నిర్మాణమై ఉన్నాయి. అమెరికా చమురుతో పోలిస్తే వెనెజులా చమురుతోనే అవి సమర్థంగా పనిచేస్తాయి. అందుకు తగ్గట్టుగానే మిగతా దేశాల కన్నా సమీపాన గల వెనెజులా నుంచే అమెరికా రోజుకు 1.02 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అవుతోంది. వెనెజులాను తన గుప్పిట్లో ఉంచుకుంటే అంతర్జాతీయంగా ముడిచమురు మార్కెట్‌పై కూడా గుత్తాధిపత్యం దక్కించుకునే అవకాశం కలుగుతుందని అమెరికా ఎత్తుగడ. ఇప్పటికే అమెరికాలో షెల్ ఆయిల్ ఉత్పత్తి బూమ్ వల్ల మార్కెట్ ఆధిపత్యం ఒపెక్ దేశాల నుంచి కొంత అమెరికాకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ దాడి వల్ల అమెరికా, దాని మిత్రదేశాలకు ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాక, ఆయా దేశాల చమురు కంపెనీలు వెనెజులాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని, చమురు ధరలు అదుపులో ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వెనెజులా లోని అమెరికా చమురు నిక్షేపాలను జాతీయం చేసి ఆ దేశ ప్రైవేట్ చమురు కంపెనీలను దేశం నుండి వెళ్లగొట్టారు. జాతీయీకరణతో ఎక్సాన్ మొబిల్, కోనోకో ఫిలిప్స్ వంటి అమెరికా బహుళ జాతి కంపెనీలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు వెనిజులా పాలకులపై డ్రగ్స్ ఆరోపణలు చేయడం ద్వారా తిరిగి ఆ చమురు నిక్షేపాలను ట్రంప్ తన అధీనం లోకి తెచ్చుకుని వాటికి సహాయం చేయడమే ట్రంప్ వ్యూహమన్న విశ్లేషణలు బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో వెనెజులా లోని చమురు నిక్షేపాలు అమెరికా, దాని మిత్రదేశాల చేతుల్లోకి వెళ్తే అంతర్జాతీయంగా చమురు మార్కెట్ తీరుతెన్నులు అనూహ్యంగా మారిపోవచ్చు. ఒపెక్, దాని మిత్రదేశాల సామర్ధాలు మరింత బలహీనం కావచ్చు. ఇక వెనెజులాలో ముడి చమురుతోపాటు అరుదైన ఖనిజ సంపద విలువ దాదాపు రూ. 1.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ విధంగా ఇతర దేశాలను కొల్లగొట్టే రణపిపాసి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఇన్నాళ్లూ అర్రులు చాచడం విశ్వశాంతికి ద్రోహం చేసినట్టే.