
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యున ల్ 1980 అవార్డ్‌తో పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశా రు. సోమవారం ఆయన శాసనసభలో జరిగిన మీ డియా చిట్-చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భం గా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు చూ పిస్తున్న లేఖ సిడబ్ల్యూసి అంతర్గతంగా సమాచా రం కోసం పంపిన లేఖ మాత్రమేనని, ఎంత మా త్రం సిడబ్యుసి ఆమోదించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ పూనుకుందని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఆయన కొట్టి పారేశారు.
పోలవరం- నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జీఆర్‌యంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణా ప్రభుత్వ అభిప్రాయంతో పైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు. అంతటితో ఆగకుండా భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే ప్రాజెక్టును ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కుడా ఆక్షేపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని నియమించిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రోజు జరగాల్సిన వాదనలు వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయని రిట్ పిటిషన్‌ను సూట్ పిటిషన్‌గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు స్వయంగా తాను హాజరు అవుతానని,మళ్ళీ స్టే ఆర్డర్ కోరతామని ఆయన తెలిపారు.
ఇదే విషయమై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులను నిలువరించడంలో విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణా సమాజం గుర్తించుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని ఆయన విమర్శించారు. జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలంకు, తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పధకం కింద తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీ- డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని బిఆర్‌ఎస్ పాలకులు మోపారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.