Reading Time: 2 minutes

వీధుల్లోకి తీసుకువచ్చి చెట్టుకు కట్టి, జట్టు కత్తిరింపు

ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో ప్రచారం

ఢాకా : బంగ్లాదేశ్‌లో అత్యంత పైశాచిక దారుణ ఘటన జరిగింది. 40 సంవత్సరాల హిందూ మహిళ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు దాడికి దిగి, సామూహిక అత్యాచారం జరిపారు. తరువాత ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని జెనాయిడా సబ్ డివిజన్‌లోని కైలాష్ గంజ్‌లో అమానుష ఘటన జరిగింది. శనివారం ఈ ఘటనకు దిగిన వ్యక్తులు ఈ చర్యను వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను కక్షతోనే, ఇప్పటి హిందూ వ్యతిరేక ద్వేషాల దశలో అదును చూసుకుని దాడికి దిగినట్లు వెల్లడైంది. ఈ బాధితురాలు కాళీగంజ్ మున్సిపాల్టీ పరిధిలో వార్డ్ నెంబరు 7లో ఉన్న షహీన్, ఆయన సోదరుడికి చెందిన స్థలాన్ని, అక్కడి బంగళాను కొనుగోలు చేసింది.

తరువాత ఆమెకు షహీన్ తరచూ అసభ్యకర సందేశాలు పంపిస్తూ, కలిసి ఉందాం అని చెపుతూ వచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో సమయం చూసుకుని ఇంటిలోకి చొరబడ్డ ఇద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది. షహీన్, హస్సన్‌లు ఆమె ఇంటిలోకి చొరబడి వారి బంధువుల ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 50వేల రూపాయిలు డిమాండ్ చేశారు. తరువాత బజారులోకి తీసుకువెళ్లి ఆమెను కొట్టి చెట్టుకు కట్టేసి గుండు చేశారని ఫిర్యాదులో తేలింది. చిత్రహింసలతో ఆమె స్పృహ తప్పిపడిపోయారు. స్థానికులు వచ్చి ఆమెను చికిత్సకు ఆసుపత్రకి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు తరువాత కూడా పోలీసులు సకాలంలో స్పందించడం లేదా దుండగులను అరెస్టు చేయడం వంటి చర్యలకు దిగలేదని స్థానిక మీడియా తెలిపింది.

హిందూ వ్యాపారి, జర్నలిస్టు రాణా ప్రతాప్ కాల్చివేత

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు బహిరంగంగా అంతా చూస్తూ ఉండగానే హిందూ వ్యక్తి రాణా ప్రతాప్ (45)పై కాల్పులు జరిపి చంపివేశారు. కేషబ్‌పూర్ ఉపజిల్లా లోని అరూవా గ్రామంలో సోమవారం సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు రాణా ప్రతాప్‌కు స్థానికంగా ఓ ఐస్ ఫ్యాక్టరీ ఉంది. స్వయంగా బంగ్లాదేశ్ పత్రికను నడిపిస్తూ , దీనికి యాక్టింగ్ ఎడిటర్‌గా ఉన్నాడు. వ్యాపారి అయిన రాణా ప్రతాప్ స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతి సమీపంలో నుంచి తలపైకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో మార్కెట్‌లో జనం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

కల్లోలిత బంగ్లాదేశ్‌లో మూడు వారాల వ్యవధిలోహిందువులపై జరిగిన దాడులలో ఇది ఐదవ ఘటనగా నిలిచింది. స్థానిక టీచరు తుషార్ కాంతి బైరాగీ కుమారుడు అయిన రాణా ప్రతాప్‌ను దుండగులు ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. మృతుడికి స్థానికంగా ఓ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు, పలు కేసులలో నిందితుడు అని పోలీసులు తెలిపారు. రాణా ప్రతాప్ ఘటనా స్థలిలోనే కుప్పకూలి చనిపోయినట్లు నిర్థారణ అయిది. కాల్పుల ఘటనలో హిందూ వ్యక్తి చనిపోయినట్లు తెలియగానే ఇక్కడి పిలు ప్రాంతాలలో ఉద్రిక్తత , భయాందోళనలు నెలకొన్నాయి.