Reading Time: < 1 minute

వాషింగ్టన్ ః అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ నివాసంపై సోమవారం దుండగులు భీకర దాడికి దిగారు. తెల్లవారుజామున ఒహియోలోని వాన్స్ నివాసంలోకి చొరబడ్డ దుండగులు చొరబడ్డారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. విధ్వంసానికి దిగారు. ఈ ఘటన సమయంలో వాన్స్ భార్య , కుటుంబ సభ్యులు ఎవరూ లేరని యుఎస్ సీక్రెట్ సర్వీసెస్ విభాగం తెలిపింది. దాడికి కారణం ఏమిటనేది తెలియలేదు. స్థానిక పోలీసు బృందాలు అక్కడికి తరలివచ్చాయి. నివాసం వద్ద ఓ అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. అక్కడి సిసిటీవీ ఫులేజ్‌లను , ఇతర సాక్షాధారాలను పరిశీలిస్తున్నారు. స్థానిక విలియం హోవార్డు టాఫ్ట్ డ్రైవ్‌లోని ఈస్ట్ వాల్నట్ హిల్స్ సమీప ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల ప్రాంతంలోనే వాన్స్ నివాసం ఉంది.

ఈ ప్రాంతం నుంచి ఓ వ్యక్తి పారిపోతూ ఉండటంతో పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే ఇంటిపై దాడి జరిగినట్లు గుర్తించారు. ఘటనా ప్రాంతానికి సిన్సినాటి పోలీసు బృందాలు చేరుకున్నాయి. పరిస్థితిని వారు ఆ తరువాత ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి ఎవరు? ఎందుకు దాడికిదిగాడు? అనేది దర్యాప్తు సంస్థలు తెలియచేయలేదు. ఈ ప్రాంతంలో ప్రజా భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడైంది. దర్యాప్తు జరుగుతున్నందున పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వలేమని అధికారులు తెలిపారు.

జెడి వాన్స్ భార్య ఉషా వాన్స్ హిందూత్వం, భారతీయత, ఆమె క్రిస్టియన్ మతం స్వీకరించకపోవడం వంటి విషయాలపై వాన్స్ అసంతృప్తి , దీనిపై సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు వంటి వాటి నేపథ్యంలో ఇప్పటి దాడికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే ఈ విషయానికి , దాడికి సంబంధం ఉందా? లేదా అనేది నిర్థారణ కాలేదు.