Reading Time: < 1 minute

వాషింగ్టన్ : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీరోడ్రిగ్జ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. అగ్రరాజ్యం మాట వినకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఓ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నికోలస మదురోను అమెరికా నిర్బంధించడంతో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీరోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె నియామకంపై శనివారం ట్రంప్ స్పందిస్తూ వెనెజువెలా లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ సుముఖంగా ఉందన్నారు.

అయితే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె అమెరికా చర్యలను విమర్శించారు. మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. డెల్సి స్పందనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ దీన్ని మేం సహించబోం. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది. వెనెజువెలా పై మా నియంత్రణకు ఆమె అంగీకరించాల్సిందే. అప్పుడే ఆ దేశాన్ని మేం పునర్‌నిర్మించగలం. మేం కోరుకున్నది ఆమె చేస్తే వెనెజువెలాలో మా బలగాలను మోహరించబోం” అని ట్రంప్ హెచ్చరించారు.

మాతో కలిసి పనిచేయండి : డెల్సీ

మరోవైపు వెనెజువెలాతో కలిసి పనిచేసేందుకు అమెరికా ప్రభుత్వానికి డెల్సీ ఆహ్వానం పంపించారు. “ శాంతిస్థాపనకు మేం కట్టుబడి ఉన్నాం. వెలుపలి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవించాలని మా దేశం కోరుకుంటోంది. ప్రతిదేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని మేం విశ్వసిస్తున్నాం. అమెరికాతోపాటు అన్ని దేశాలతో మర్యాదపూర్వక, సమతుల్య సంబంధాలు నెలకొల్పడానికి మేం ప్రాధాన్యమిస్తాం. మా దేశ పురోగతి కోసం మాతో కలిసి పనిచేసేందుకు అమెరికాను ఆహ్వానిస్తున్నాం. ” అని ఆమె తన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.