
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, బిఆర్‌ఎస్ తనను ఘోరంగా అవమానించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇడి, సిబిఐతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని అన్నారు. కెసిఆర్‌పై కక్షతో బిజెపి తనను జైలులో పెట్టించిందని ఆరోపించారు. కెసిఆర్‌పై విమర్శలు వచ్చినా బిఆర్‌ఎస్ నేతలు స్పందించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు బిఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని చెప్పారు. మన పండుగ గౌరవం కాపాడాలని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు చేశాను. బతుకమ్మ మన ఆత్మగౌరవ ప్రతీకగా ముందుకు వెళ్లామని, 3 వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర సాక్ష్యాలతో పుస్తకాలను వెలువరించామని తెలిపారు. అప్పుడు మీడియాలో, సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానంపై పోరాటం చేశామని గుర్తు చేశారు. అప్పటి పాఠ్యా పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవటాన్ని ప్రశ్నించామని, అప్పటి శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు ఇచ్చామని చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ తుది రిపోర్ట్‌లో కూడా తాము చెప్పిన అంశాలు నిజమేనని చెప్పిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేశామని అన్నారు.