
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునీత ధ్వజమెత్తారు. కవిత ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. కవిత ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్ళినప్పుడు ఆమె కోసం పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉన్నదని చెప్పారు. ఆమె జైలులో ఉన్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిరంతరం ఆమె కోసమే ఆలోచన చేశారని, ఆమెను విడిపించడానికి హరీష్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. అలాంటి వాళ్లను పట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. వారి వ్యక్తిగత విషయాలు శాసనమండలిలో మాట్లాడుతూ తాను రూల్ ప్రకారం మాట్లాడుతున్నానని అన్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో ఎంపి స్థానం నుంచి ఓడిపోతే కవిత బాధను చూడలేక కెసిఆర్ ఎంఎల్‌సి పదవిని ఇచ్చారని చెప్పారు. ఆమె కంటే సీనియర్ అయిన వినోద్ కుమార్‌ను కాదని కవితకు ఎంఎల్‌సి ఇచ్చారని అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ మహిళా నేతలు తుల ఉమ, సుమిత్రా ఆనంద్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చడం ఇష్టం లేదన్న కవిత, తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పాలని నిలదీశారు.కవిత తెలంగాణ జాతి పిత కెసిఆర్‌ను క్షోభకు గురి చేస్తే మంచిది కాదని హితవు పలికారు. ఆమె స్వతహాగా జాగృతి పెట్టుకొని కూడా ఎవరో ఆడిస్తే ఆట ఆడుతున్నారని అందరికీ తెలుసని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరణ చేస్తే దానిపై కూడా ఏదేదో మాట్లాడారని, ఎవరు చెబితే శాసనసభ బహిష్కరణ చేస్తారో బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ఆమెకు తెలియదా..? అని ప్రశ్నించారు.ఆమె నాలుగు నెలల క్రితం ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేస్తే ఎందుకు పదవిలో కొనసాగారని ప్రశ్నించారు. కవిత మనస్పూర్తిగా రాజీనామా చేయలేదా..? అని అడిగారు. బిఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే ఆమె శాసనమండలికి ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఆమె దగ్గరకు అంగన్వాడీలు, ఇతరులు చాలా మంది వస్తారు అంటున్నారని, శాసనమండలిలో వాళ్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడి వద్ద ఆమెకు ఉన్న చనువు ఎవరికీ లేదని, పార్టీలో కవిత ఎన్ని పదవులు ఇప్పిచ్చారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆమె అంటున్నారని, అదే లేకపోతే ఆమెకు పదవులు ఎలా ఇప్పించుకున్నారని ప్రశ్నించారు.
కవిత తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. జనం బాట పేరుతో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, పార్టీ శ్రేణులు ఆగ్రహిస్తే కవిత గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. తమ ఓపికను బలహీనతగా భావించొద్దని సూచించారు. ఉద్యమకారులకు పదవులు ఇవ్వక వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని కవిత అంటున్నారని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వేరే పార్టీ నుంచే వచ్చారని, ఆయన మాత్రం కవిత ఉద్యమకారుడిలా కనిపిస్తున్నారా..? అని ప్రశ్నించారు.