
ఇన్నాళ్ల హెచ్చరికలు , పక్షం రోజుల క్రితం సిఐఎ ద్వారా వెనెజులాపై డ్రోన్ల దాడుల తరువాత అమెరికా ఇప్పుడు భీకర ప్రత్యక్ష దాడికి ఎందుకు దిగిందనేది కీలక విషయం అయింది. ఇంతకు ముందు అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమరవాణా, అమెరికాలో వెనెజులా సిండికేట్ల ఏర్పాటు , ఏకంగా నార్కో టెర్రరిజం ఆరోపణలపైనే మదురోనే టార్గెట్ చేసుకునే ట్రంప్ ఈ వ్యూహాత్మక దాడులకు దిగినట్లు వెల్లడైంది. వేలాదిగా వెనెజులాలలు అమెరికాలోకి అక్రమంగా చేరుకుంటున్నారని, వీరితో తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ప్రెసిడెంట్ ట్రంప్ చాలాసార్లు హెచ్చరించారు.
2013 నుంచి ఇప్పటివరకూ దాదాపు కోటి మంది వరకూ అమెరికాలోకి వచ్చారని, దీనితో తమ దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడిందని, పైగా కొన్ని ప్రాంతాలలో సమాంతర ఆర్థిక వ్యవస్థ సాగే పరిస్థితి ఏర్పడుతోందని కూడా ట్రంప్ తెలిపారు. అయితే దీనిని నిరూపించే ఎటువంటి సాక్షాధారాలు చూపెట్టలేదు. మదురో తమ దేశంలోని జైళ్ల ఖైదీలను విడుదల చేయించి వారిలో కరడుగట్టిన నేరస్తులను అక్రమంగా అమెరికాకు తరలింవాడని ట్రంప్ గతంలో ఆరోపించారు. వెనెజులా ఖైదీలకు అమెరికా వేదిక అవుతున్నదనే ట్రంప్ ఆరోపణలను మదురో పలుసార్లు ఖండించారు. అన్నింటికి మించి డ్రగ్స్ వ్యాపారం వెనెజులా ద్వారానే అమెరికాలో విస్తరించుకుందని ట్రంప్ భావిస్తున్నారు.
కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు ఈ దేశం ద్వారానే తమ నేలకు చేరుకుంటున్నాయని ట్రంప్ విమర్శించారు.ఇ ందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు. వెనెజులాకు చెందిన రెండు సంస్థలు ట్రెన్ డి అరాగువా, కార్టెల్ డె లస్ సోల్స్‌ను క్రిమినల్ గ్యాంగ్‌లుగా నిర్థారించారు. వీటిపై విదేశీ ఉగ్ర సంస్థల (ఎఫ్‌టిఒ) ముద్ర వేశారు. ఈ సంస్థలలో ఒకటి మదురో ఆధ్వర్యంలోనే సాగుతోందని కూడా ట్రంప్ ఆరోపించారు. ఈ వాదన సరికాదని వెనెజులా వివరణ ఇచ్చుకుంది. అయితే దీనితో నిమిత్తం లేకుడా ఇప్పుడు అమెఇరాక భీకరదాడులు తరువాత వెనెజులా నేత నిర్బంధం జరిగిపోయింది.