
న్యూఢిల్లీ : యూపీయే పాలనలో అమలు లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీ నరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టం వీబీ జి రామ్ జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు “ఎంజీ నరేగా బచావో సంగ్రామ్”పేరున జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆందోళన సాగించనున్నట్టు శనివారం కాంగ్రెస్ వెల్లడించింది. పనిచేసే హక్కు కల్పించే చట్టంగా ఎంజీ నరేగాను తిరిగి అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఆందోళన సాగుతుందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరామ్ రమేశ్ సంయుక్త పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
కొత్త విబిజి రామ్ జి చట్టంలో పనిచేసే ప్రాథమిక హక్కును తొలగించి కేంద్రం పూర్తిగా తన కేంద్రీకరణగానే నిర్ధారించిందని . దీనిపై కోర్టులో సవాలు చేయాల్సి ఉందన్నారు. ఇండియా కూటమి పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా కొత్త చట్టాన్ని అమలు చేయడం లేదా వ్యతిరేకించడం కానీ చేయబోవడం లేదని వేణుగోపాల్ పేర్కొంటూ కూటమి భాగస్వాములైన మిత్ర పక్షాలతో కాంగ్రెస్ చర్చిస్తుందని చెప్పారు. డిసెంబర్ 18న లోక్‌సభ ఆమోదించిన కొన్ని గంటల్లోనే రాజ్యసభ విబి జిరామ్ జి బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదించింది. డిసెంబర్ 21న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ బిల్లును చట్టంగా రూపొందడానికి అంగీకరించింది.
“ఎంజీనరేగా”పై దాడి …కోట్ల మంది కార్మికులపై దాడియే: ఖర్గే
“ఎంజీనరేగా”పై దాడి చేయడమంటే కోట్ల మంది కార్మికులపైనే కాదు, వారి పనిచేసే రాజ్యాంగ హక్కుపై దాడిచేయడమేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం వ్యాఖ్యానించారు. దీనిని తమ పార్టీ పంచాయతీల నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రశాంతంగా, గట్టిగా వ్యతిరేకిస్తుందని వివరించారు. “ భారత జాతీయ కాంగ్రెస్ మూడు డిమాండ్లు స్పష్టంగా, ఏకగ్రీవంగా చేస్తోంది విబి జి రామ్ జి చట్టాన్ని ఉపసంహరించడం, హక్కుల చట్టంగా ఎంజీనరేగాను పునరుద్ధరించడం, పనిచేసే హక్కును పునరుద్దరించి పంచాయతీల అధికారం కిందకు తీసుకు రావడం ” అందుకనే జాతీయ స్థాయిలో ఎంజీనరేగా బచావో సంగ్రాం జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఖర్గే తెలిపారు.
“ఎంజీనరేగా అన్నది దయాభిక్ష కాదు.ఇది చట్టపరమైన గ్యారంటీ. కోట్లాది మంది పేద ప్రజలు తమ గ్రామాల్లో పనులు పొందగలిగారు. ఆకలి బతుకులు, వలసలు వెళ్లే పరిస్థితులు ఎంజీనరేగా వల్ల బాగా తగ్గాయి. గ్రామాల్లో కూలివేతనాలు పెరిగాయి. మహిళల ఆర్థిక హోదా పటిష్టమైంది. ఈ హక్కును విబి జి రామ్‌జి చెల్లా చెదురు చేసింది. ” అని ఖర్గే పేర్కొన్నారు. “బడ్జెట్‌లకు పరిమితి విధించబడుతుంది. కాబట్టి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా నిధులు అయిపోతే పనులు ఆగిపోతాయి. గ్రామపంచాయతీలకు వీటి ప్రసక్తే ఉండదు ” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ కొత్త పథకం అమలులో రాష్ట్రాలు తప్పనిసరిగా 40 శాతం నిధులు భరించేలా ఒత్తిడి తెచ్చారు. అది ఫెడరలిజంను బలహీన పరిచే చర్య. పేద రాష్ట్రాలకు హాని. బయోమెట్రిక్స్, యాప్ ఆధారిత అడ్డంకులతో సాంకేతికత కార్మికులను వెలివేస్తుంది. గ్రామాల ఆస్తులు కాంట్రాక్టర్ శైలి ప్రాజెక్టులతో చోటు చేసుకుంటాయి” అని ఖర్గే ఆరోపించారు.