
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఎప్‌సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రెండ్రోజులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. ఈ ఎగ్జామ్స్‌కు మొత్తం 90,958 మంది అటెండ్ కానుండగా, వారి కోసం 106 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి చెప్పారు.
తొలిరోజు రెండు సెషన్లు.. రెండో రోజు ఒకే సెషన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. సోమవారం మార్నింగ్ సెషన్‌లో 30,333 మంది, ఆఫ్టర్ నూన్ సెషన్‌లో 30,253 మంది ఎగ్జామ్ రాయనుండగా, మంగళవారం మార్నింగ్ సెషన్‌లో 30,372 మంది రాస్తారని పేర్కొన్నారు. పరీక్షలకు అటెండ్ అయ్యే విద్యార్థులను నిర్ణీత టైమ్‌కు గంటన్నర ముందే అనుమతిస్తామన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకురావాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే స్ర్కీన్‌పై ప్రైమరీ కీకి అనుగుణంగా మార్కులతో పాటు ర్యాంకును డిస్ ప్లే చేయనున్నామని వెల్లడించారు.