Reading Time: < 1 minute

హోటల్కు వెళ్తే జేబు గుల్లే ! ధరలు 15 శాతం వరకు పెరిగే చాన్స్

Caption of Image.
  • గ్యాస్ రేటు భారీగా పెరగడమే కారణం
  • ఉద్యోగాలకూ కోతలు
  • ఇప్పటికే చాలా హోటల్స్​ బంద్​

న్యూఢిల్లీ: హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ల ధరల పెంపు ఆతిథ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని పరిశ్రమ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.993 పెరిగి రూ.3,071.50 రికార్డు స్థాయికి చేరుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా హోటల్ మెనూ ధరలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది.  ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్​హెచ్​ఆర్​ఏఐ) వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ శెట్టి మాట్లాడుతూ, పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి ఈ ధరల పెంపు కూడా సరిపోకపోవచ్చని అన్నారు.

గత నెల రూ.195.50, మార్చి నెలలో రూ.144 చొప్పున ధరలు పెరిగాయి. కేవలం మూడు దఫాల్లోనే రూ.1,332.50 పెరిగింది. సరఫరాలో ఆటంకాలు, తగ్గిన నగదు ప్రవాహంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న హోటల్ రంగానికి ఇది గొడ్డలిపెట్టుగా మారింది. చాలా సంస్థలు పని గంటలను తగ్గించుకున్నాయి. పరిమితమైన మెనూతో నడుస్తున్నాయి. ధరల భారం వల్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. చాలా హోటళ్లు ఇప్పటికే తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ పెంపు వల్ల మరిన్ని మూసివేతలు, ఉద్యోగాల కోత తప్పదని ప్రదీప్ శెట్టి హెచ్చరించారు.

‘‘ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలి. లేకుంటే ఉపాధిని కల్పించే కీలకమైన హాస్పిటాలిటీ రంగం మనుగడ కష్టమవుతుంది. జనానికి హోటళ్లలో తినడం భారమవుతోంది. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న యజమానులకు ఇంధన ధరల భారం ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందింది. మెనూ ధరలు పెంచడం వల్ల వినియోగదారుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది’ అని ప్రదీప్ ​వివరించారు.

©️ VIL Media Pvt Ltd.