
కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లగానే ఆయన మీకు రెండు ఆప్షన్లు ఇస్తారు. ఒకటి నెలకు రూ.43వేలు కడుతూ 20 ఏళ్లలో లోన్ తీర్చేయడం. రెండోది నెలకు కేవలం రూ.38వేలు కడుతూ 30 ఏళ్ల పాటు లోన్ కొనసాగించడం. నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది కదా అని మీరు రెండో ఆప్షన్ ఎంచుకున్నారా? అయితే మీరు తెలియకుండానే అక్షరాలా రూ.34 లక్షలు నష్టపోతున్నారని గమనించండి. హోమ్ లోన్ విషయంలో ఈఎంఐ కంటే కూడా టెన్యూర్ ఎలా మీ సంపదను హరించివేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి..
తక్కువ ఈఎంఐ.. భారీ నష్టం:
చాలామంది హోమ్ లోన్ తీసుకునేటప్పుడు నెలకు ఎంత భారం పడుతుంది? అనేదే ఆలోచిస్తారు. రూ.50 లక్షల లోన్ 8.5% వడ్డీ రేటుతో తీసుకున్నప్పుడు.. 30 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుంటే ఈఎంఐ తక్కువగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. 20 ఏళ్లకు మీరు కట్టే మొత్తం వడ్డీ రూ.54 లక్షలు అయితే, అదే లోన్‌ను 30 ఏళ్లకు పొడిగిస్తే మీరు కట్టే వడ్డీ ఏకంగా రూ.88 లక్షలకు చేరుతుంది. అంటే కేవలం నెలకు రూ.5వేలు తక్కువ కట్టడం కోసం అదనంగా మీ పిల్లల విదేశీ చదువులకు సరిపడా డబ్బును వడ్డీ రూపంలో బ్యాంకుకు సమర్పిస్తున్నారు.
వడ్డీ రేటు కంటే కాలపరిమితికే పవర్ ఎక్కువ:
మనం సాధారణంగా 8.5% వడ్డీ ఇచ్చే బ్యాంకు కంటే 8% ఇచ్చే బ్యాంకు కోసం గాలిస్తాం. వడ్డీ రేటు తగ్గడం మంచిదే.. కానీ వడ్డీ రేటులో వచ్చే 0.5% మార్పు కంటే, లోన్ కాలపరిమితిలో ఉండే 10 ఏళ్ల గ్యాప్ మీ జేబుకు ఎక్కువ చిల్లు పెడుతుంది. మీరు ఎంత తక్కువ కాలంలో లోన్ చెల్లింపు పూర్తి చేస్తే, అంత ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని గమనించండి.
సమయం వర్సెస్ డబ్బు:
లోన్ కాలపరిమితి పెంచడం వల్ల రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి మీరు కట్టే అదనపు వడ్డీ. రెండోది మీరు కోల్పోయే పెట్టుబడి అవకాశం. ఆదా చేసిన రూ.5వేలు మొత్తాన్ని ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో 12 శాతం రాబడిని ఇచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే.. 20 ఏళ్లలో అది రూ.46 లక్షల సంపదగా మారుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో పోగొట్టుకున్న రూ.34 లక్షలు కాకుండా.. ఈ రూ.46 లక్షల లాభాన్ని కూడా వదులుకుంటున్నట్టే.
లాంగ్ స్టార్ట్.. షార్ట్ ఫినిష్ ప్లాన్:
ప్రస్తుత ఖర్చులు, జీతం దృష్ట్యా తక్కువ ఈఎంఐ కోసం ఎక్కువ కాలపరిమితి ఎంచుకోవడం తప్పనిసరి కావచ్చు. కానీ దానినే ఫైనల్ అనుకోవద్దు. లోన్ నుంచి త్వరగా బయటపడటానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి..
* ప్రీ-పేమెంట్స్: మీకు బోనస్ వచ్చినప్పుడు లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు లోన్ అసలు కొంత చెల్లించండి. చిన్న మొత్తాలు కూడా మీ కాలపరిమితిని ఏళ్ల తరబడి తగ్గిస్తాయి.
* ఈఎంఐ పెంచండి: మీ జీతం పెరిగిన ప్రతిసారీ, దాంతో పాటు మీ ఈఎంఐని కూడా కొంచెం పెంచండి. ఇది లోన్ భారాన్ని వేగంగా తగ్గిస్తుంది.
* టాక్స్ బెనిఫిట్స్: పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద అసలుపై రూ.1.5 లక్షలు, సెక్షన్ 24B కింద వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.