Reading Time: 2 minutes

మారిన గోల్డ్ అమ్మకాల ట్రెండ్: జ్యువెలరీ వద్దంటూ.. కాయిన్స్, బిస్కెట్స్ కొంటున్న భారతీయులు

Caption of Image.

గోల్డ్ అంటే భారతీయులకు సెంటిమెంట్. పెళ్లిళ్లు, పండుగలు వస్తే చాలు నెక్లెస్‌లు, గాజుల రూపంలో కిలోల కొద్దీ బంగారాన్ని కొనేయడం మనకు అలవాటు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి తైమాసికంలో ఒక వింత పరిణామం చోటుచేసుకుంది. భారతీయులు ఒంటిపైన ధరించే నగల కంటే పెట్టుబడి బంగారం వైపే మొగ్గు చూపారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం భారతీయ బంగారం మార్కెట్‌లో వచ్చిన మార్పులకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇవే:

పెట్టుబడి వర్సెస్ నగలు: 
సాధారణంగా భారతీయ మార్కెట్‌లో జ్యువెలరీ ఆభరణాలకు ఉండే డిమాండ్ ఎక్కువ. కానీ ఈ ఏడాది మార్చి తైమాసికంలో పెట్టుబడి డిమాండ్ నగలను అధిగమించింది. బంగారం ధరలు చుక్కలను తాకడంతో నగలు కొనడం తగ్గించిన ప్రజలు.. కాయిన్స్, బార్స్, గోల్డ్ ఈటీఎఫ్ లపై పెట్టుబడి పెట్టారు. మొత్తం వినియోగంలో పెట్టుబడి వాటా ఏకంగా 54.3 శాతానికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

అంకెల్లో చూస్తే..
మార్చి తైమాసికంలో పెట్టుబడి డిమాండ్ గతేడాదితో పోలిస్తే 52% పెరిగి 82 మెట్రిక్ టన్నులకు చేరింది. అదే సమయంలో నగల డిమాండ్ 19.5% తగ్గి 66 టన్నులకు పడిపోయింది. దేశం మొత్తం మీద బంగారం వినియోగం 10.2% వృద్ధి చెంది 151 మెట్రిక్ టన్నులుగా ఉంది. కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాదు.. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు ఏకంగా 186% పెరిగి 20 టన్నుల రికార్డు స్థాయికి చేరడం గమనార్హం.

మార్కెట్ ఎందుకిలా మారింది..?
స్టాక్ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే దీనికి ప్రధాన కారణం. 2025 ప్రారంభం నుంచి దేశీయంగా బంగారం ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే బెంచ్‌మార్క్ నిఫ్టీ-50 కేవలం 2.4% మాత్రమే పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో రిస్క్ ఎందుకు అనుకున్న ఇన్వెస్టర్లు.. సురక్షితమైన బంగారం వైపు మళ్లారు.

మున్ముందు ట్రెండ్ ఎలా ఉండబోతోంది?
రాబోయే రోజుల్లో కూడా పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈఓ సచిన్ జైన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నారని, ధరలు భారీగా ఉండటంతో నగలు కొనేవారు ఆచితూచి అడుగు వేస్తున్నారని ట్రెండ్ స్పష్టం చేస్తోంది. భారతీయుల దృష్టి అలంకరణ నుంచి ఆర్థిక భద్రత వైపు మారుతుందనడానికి ఈ మార్పు చెబుతోంది. 
 

©️ VIL Media Pvt Ltd.