
వెస్ట్ బెంగాల్ 2వ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్.. సెకండ్ ఫేజ్ లో కూడా భారీగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. 2026 ఏప్రిల్ 29వ తేదీ న 7 గంటలకు మొదలైన పోలింగ్ లో.. ఉదయం 9 గంటలలోపే రికార్డు స్థాయిలో దాదాపు 20 శాతం నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నార్త్ 24 పరగణాల్లో మహిళా ఓటర్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. పోలింగ్ స్టేషన్ల ముందు భారీ క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిలుచున్నారు. ఇంత పొద్దున్నే పోలింగ్ కు ఇంత స్పందన రావడం ఎలక్షన్ స్పిరిట్ కు, ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలలోపు ఆల్ ఓవర్ గా 20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పూర్బా బర్ధమాన్ లో 20.86 శాతంగా రికార్డయింది. ఆ తర్వాత హూగ్లీ 20.16, నదియా 18.50, నార్త్ పరగణా 17.81, హౌరా 17.76, కోల్ కతా నార్త్ అండ్ సౌత్ 17.28, 16.81 గా పోలింగ్ శాతం నమోదైంది.
బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతోంది: మమతా బెనర్జీ
బీజేపీ రింగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం పర్యవేక్షకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర బలగాలు టీఎంసీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోకి ప్రవేశించి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమత ఆరోపణలపై బీజేపీ చీఫ్ సువేందు అధికారి తిప్పికొట్టారు. మమత ఫాలోవర్లు గూండాగిరి చేస్తున్నారని విమర్శించారు.
ఇక బీజేపీ ఆధ్వర్యంలో రిగ్గింగ్ జరుగుతోందని.. ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని తృణమూల్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఈడ్చుకెళ్లారు. ఒక కాలు, ఒక చేయి పట్టి ఈడ్చుకెళ్తున్న వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చెదరగొట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.