
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా విధుల నుంచి తొలగించబడిన సర్పంచులు దాఖలు చేసిన అప్పీళ్లపై పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ గురువారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రామిరెడ్డితో పాటు సభ్యులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్, బాస వెంకట వేణుగోపాల్ యాదవ్ ఈ విచారణలో పాల్గొన్నారు.
విచారణ సందర్భంగా అప్పీలుదారులు, ప్రతివాదుల తరఫు న్యాయవాదుల వాదనలను సభ్యులు క్షుణ్ణంగా విన్నారు. సర్పంచులు తమ పదవీకాలంలో ఎదుర్కొన్న సమస్యలు, వారిపై వచ్చిన ఆరోపణలు, అధికారుల ఉత్తర్వులు, అప్పీళ్లలో పేర్కొన్న అంశాలను ట్రిబ్యునల్ సమగ్రంగా పరిశీలించింది.