Reading Time: 2 minutes

YouTube నుంచి లక్షలు సంపాదిస్తున్నారా..? టాక్స్ ఎలా కట్టాలో తెలుసా ఇన్‌ఫ్లూయన్సర్స్

Caption of Image.

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా? అయితే మీకు వచ్చే ప్రతి రూపాయికి పన్ను ఎలా లెక్కిస్తారు, విదేశాల నుంచి డాలర్లలో వచ్చే ఆదాయాన్ని ఎలా చూపించాలి, ఏ ఖర్చులను ఆదాయం నుంచి తీసేయొచ్చు అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇన్‌ఫ్లూయన్సర్స్. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో పాటు బ్రాండ్ ప్రకటనల ద్వారా వచ్చే డబ్బు కూడా పన్ను లెక్కలోకి వస్తుంది. సరైన లెక్కలు, డాక్యుమెంట్స్ లేకపోతే తర్వాత ఇన్కమ్ టాక్స్ అధికారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే యూట్యూబ్ ఆదాయాన్ని మొదటి నుంచే సక్రమంగా లెక్కించడం మంచిది.

డాలర్లను రూపాయల్లోకి ఎలా మార్చాలి?
యూట్యూబ్ ద్వారా విదేశాల నుంచి డాలర్లలో డబ్బు వస్తే దాన్ని భారతీయ రూపాయల్లోకి మార్చి ఆదాయంగా చూపించాలి. ఇందుకోసం ఆదాయపు పన్ను నిబంధనల్లో పేర్కొన్న టెలిగ్రాఫిక్ బదిలీ కొనుగోలు రేటును ఉపయోగించాలి. ఉదాహరణకు ఒక యూట్యూబర్‌కు ఏడాదిలో 42వేల డాలర్లు వచ్చాయని అనుకుందాం. ఒక డాలర్ విలువ రూ.95గా తీసుకుంటే 42వేల డాలర్ల విలువ రూ.39లక్షల 90వేలు అవుతుంది. దీనికి భారతదేశంలోని కంపెనీల నుంచి వచ్చిన యాడ్ రెవెన్యూ రూ.9 లక్షలు కలిపితే మొత్తం ఆదాయం రూ.48లక్షల 90వేలు అవుతుంది.

మొత్తం ఆదాయంపై పన్ను ఉండదు
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మొత్తం రూ.48లక్షల 90వేలపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడానికి చేసిన కొన్ని అవసరమైన ఖర్చులను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. కెమెరా, ల్యాప్‌టాప్, లైట్స్, మ్యూజిక్ వంటి పరికరాల ఖర్చు.. వీడియో ఎడిటర్‌కు ఇచ్చే డబ్బు, స్క్రిప్ట్ రైటర్‌కి వారికి ఇచ్చే పేమెంట్స్, అవసరమైన సాఫ్ట్‌వేర్ ఖర్చులు, ఇంటర్నెట్, స్టూడియో అండ్ ఆఫీస్ రెంట్స్, వీడియోల కోసం చేసే ట్రావెల్ ఖర్చులు, టాక్స్ కన్సల్టెంట్లకు చెల్లించే ఫీజులు వంటి వాటిని రూల్స్ ప్రకారం మెుత్తం ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు.

►ALSO READ | చైనా వస్తువులు భారత్ మీదుగా అమెరికాకు? ట్రాన్స్‌షిప్‌మెంట్‌పై ట్రంప్ టీమ్ సీరియస్

ఉదాహరణకు మొత్తం రూ.48లక్షల 90వేల ఆదాయంలో రూ.9లక్షల 60వేలు అర్హత ఉన్న వ్యాపార ఖర్చులు ఉన్నాయని అనుకుందాం. అప్పుడు మిగిలే ఆదాయం రూ.39లక్షల 30వేలు. ఈ మొత్తాన్ని పన్ను లెక్కలోకి తీసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తించే కొత్త పన్ను విధానం ప్రకారం ఈ ఆదాయంపై సుమారు రూ.7లక్షల 59వేలు పన్ను వస్తుంది. దీనికి 4 శాతం హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ కలిపితే మొత్తం పన్ను సుమారు రూ.7లక్షల 89వేలు అవుతుంది. ఇప్పటికే చెల్లించిన పన్ను, విదేశాల్లో కట్ అయిన అర్హత ఉన్న పన్నును మినహాయించిన తర్వాత భారత్‌లో చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. ఇది కేవలం అర్థం చేసుకోవడానికి ఇచ్చిన లెక్క మాత్రమే.

అమెరికాలో కట్ అయిన పన్ను సంగతేంటి?
అమెరికా ప్రేక్షకుల ద్వారా వచ్చిన యూట్యూబ్ ఆదాయంపై అక్కడ కొంత పన్ను కట్ అయ్యే అవకాశం ఉంది. అయితే అదే ఆదాయంపై భారత్‌లో మళ్లీ పూర్తిగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా.. భారత్-అమెరికా పన్ను ఒప్పందం ప్రకారం అర్హత ఉంటే విదేశాల్లో చెల్లించిన పన్నుకు భారత్‌లో మినహాయింపు పొందవచ్చు. ఇందుకు అమెరికాలో పన్ను కట్ అయినట్లు చూపించే డాక్యుమెంట్స్ భద్రపరచాలి. 

ఏ పత్రాలు జాగ్రత్తగా ఉంచాలి?
యూట్యూబర్లు తమకు వచ్చిన డబ్బు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, అమెరికాలో పన్ను కట్ అయిన పత్రాలు, దేశీయ యాడ్స్ బిల్లులు, దేశంలో ఇప్పటికే చెల్లించిన పన్ను వివరాలు వంటి వాటిని భద్రంగా ఉంచాలి. యూట్యూబ్ ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం వస్తే దాన్ని వ్యాపార ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి వ్యాపార ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. చివరగా, పన్ను చెల్లించాల్సిన మొత్తం రూ.10వేలు దాటే అవకాశం ఉంటే ముందస్తు పన్ను చెల్లించే నిబంధనలను కూడా పాటించాలి.

©️ VIL Media Pvt Ltd.