
భారతదేశంలోని జెన్ జీ యువత అంటే డిజిటల్ ప్రపంచం, ప్రయాణాలు, కొత్త అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తరం అనే అభిప్రాయం ఉంది. అయితే వారి వాస్తవ ఖర్చుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. జీతం పొందుతున్న భారత జెన్ జీ యువత తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ మొత్తాన్ని రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే కేటాయిస్తున్నట్లు SalarySe అధ్యయనం తెలిపింది.
5.2 లక్షలకు పైగా జీతం పొందుతున్న జెన్ జీ వినియోగదారులకు సంబంధించిన లక్షలాది UPI లావాదేవీలను విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. యువత నెలవారీ ఖర్చుల్లో ప్రయాణాలకు కేవలం 5 శాతం మాత్రమే వెచ్చిస్తున్నారు. దీంతో జెన్ జీ మొత్తం డబ్బును లైఫ్‌స్టైల్, ట్రావెల్‌పై ఖర్చు చేస్తుందనే అభిప్రాయానికి ఈ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి.
బిల్లులకే అత్యధిక ఖర్చు..
జెన్ జీ నెలవారీ ఖర్చుల్లో బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ ఐదు విభాగాలను కలిపితే మొత్తం నెలవారీ ఖర్చులో 70 శాతానికి పైగా ఉంటోంది.
వినోద సబ్‌స్క్రిప్షన్లకు కూడా జెన్ జీలో ప్రాధాన్యత ఉంది. పునరావృతమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్లలో జియో హాట్‌స్టార్ 12.4 శాతంతో ముందుండగా, Netflix 10.7 శాతం, Spotify 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
వయసు పెరిగేకొద్దీ..
18-23 ఏళ్ల జెన్ జీ, 24-29 ఏళ్ల జెన్ జీ వర్గాలను కూడా అధ్యయనం పరిశీలించింది. రెండు వయసు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చు 32 శాతంగా ఉన్నప్పటికీ, అవసరమైన ఖర్చుల్లో మాత్రం తేడా కనిపించింది. 18-23 ఏళ్ల వయసులో అవసరాల కోసం చేసే ఖర్చు 50 శాతం ఉండగా, 24-29 ఏళ్ల వయసులో అది 59 శాతానికి పెరిగింది. దీనికి ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరగడం, ఆర్థిక కట్టుబాట్లు ఎక్కువ కావడం కారణమని అధ్యయనం సూచిస్తోంది. బిల్లులు, కిరాణా, ఆహారం, ఆర్థిక సేవలు వంటి ఖర్చులకు ప్రాధాన్యత పెరుగుతోంది.
SalarySe సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా మాట్లాడుతూ.. భారత జెన్ జీ తమ ఆర్థిక జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని డిజిటల్ ఆధారిత వ్యవస్థల ద్వారా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. UPI, ఆటోపే వంటి సౌకర్యాలు బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఆర్థిక చెల్లింపులను సులభతరం చేస్తున్నాయని తెలిపారు. మొత్తంగా చూస్తే.. ప్రయాణాలు, వినోదం ఉన్నప్పటికీ భారత జెన్ జీ యువత బడ్జెట్‌లో ప్రధాన భాగం ఇప్పటికీ నిత్యావసరాలకే వెళ్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.