Reading Time: 2 minutes
Why India Got Independence At Midnight August 15 1947

India Independence: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో కూర్చుని రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురై గట్టిగా కేకలు వేశారు. ఆ క్షణంలో ఆయన ముఖంలో ఆనందం కాదు.. అపారమైన భయం, ఆందోళన నిండిపోయాయి. అప్పటివరకు భారతీయులంతా ఏ ముహూర్తం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారో, ఆ స్వతంత్ర భారత్ ఆవిర్భావ తేదీని బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ అప్పుడే ఆల్ ఇండియా రేడియో వేదికగా ప్రకటించారు. 1948 జూన్ వరకు ఉన్న గడువును ముందుకు జరిపి, 1947 ఆగస్టు 15నే భారత్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు వెల్లడించారు. దేశమంతా పండగలా భావించాల్సిన ఆ వార్త.. స్వామి మదనానంద్‌ను మాత్రం భయాందోళనల్లోకి నెట్టేసింది. వెంటనే ఆయన తన జ్యోతిష్య పటాలు, గ్రహాల చక్రాల వైపు పరుగెత్తారు. ఆగస్టు 15 నాటి గ్రహ స్థితులను లెక్కగట్టి చూశాక ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. “గ్రహాల స్థితి దారుణంగా ఉంది.. ఆ రోజు భారత్‌ జన్మించకూడదు” అని ఆయన అంతరాత్మ ఘోషించింది.

మదనానంద్ ఒక్కరే కాదు.. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే కలకత్తా, బెనారస్ (వారణాసి), దక్షిణ భారతదేశంలోని దిగ్గజ జ్యోతిష్కులందరూ తమ ఖగోళ చక్రాలను తిరగేయడం ప్రారంభించారు. అందరి లెక్కింపుల ముగింపు ఒక్కటే.. భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి నిర్ణయించిన ‘ఆగస్టు 15’ అత్యంత అశుభకరమైన రోజు! ఆ రోజు శుక్రవారం కావడం, మకర లగ్నంలో శని, రాహువుల ప్రభావం ఉండటం, గురు, శుక్ర గ్రహాలు అత్యంత అపశకున స్థానాల్లో కొలువై ఉండటంతో అది దేశానికి పెను ముప్పు తెస్తుందని వారు బలంగా నమ్మారు. ఈ తేదీ మార్చకపోతే వరదలు, కరువులు, దారుణమైన మారణకాండలు ఈ దేశాన్ని ముంచెత్తుతాయని హెచ్చరిస్తూ మదనానంద్ స్వయంగా మౌంట్‌బాటన్‌కు లేఖ కూడా రాశారు. “భగవంతుడి మీదొట్టు.. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకండి” అని ఆ లేఖలో వేడుకున్నారు. మరోవైపు ప్రముఖ జ్యోతిష్కులు జవహర్‌లాల్ నెహ్రూతో సహా ప్రధాన నాయకులను కలసి ఆందోళన వ్యక్తం చేశారు.

అసలు ఈ ఆగస్టు 15వ తేదీ వెనుక ఉన్న కథేంటి? మౌంట్‌బాటన్ భారతదేశంలో వేలాది ఏళ్లుగా వస్తున్న జ్యోతిష్య సాంప్రదాయాన్ని, ఖగోళ నమ్మకాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకుండా ఈ తేదీని ప్రకటించారు. నిజానికి దీని వెనుక ఆయన వ్యక్తిగత కారణం ఒకటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మిత్రరాజ్యాలకు లొంగిపోయి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భం ఆగస్టు 15. తన అధికారానికి, విజయానికి గుర్తుగా ఆ రోజునే ఆయన హఠాత్తుగా ఎంచుకున్నారు. కానీ, రాజకీయ వేగం పుంజుకున్న ఆ సమయంలో బ్రిటీష్ వారు ప్రకటించిన తేదీని మార్చడం అసాధ్యంగా మారింది. అలాగని కోట్ల మంది నమ్మకాలను, జ్యోతిష్కుల హెచ్చరికలను తోసిపుచ్చడం నాయకులకు ఇష్టం లేదు. అసలే దేశ విభజన, రాజకీయ ఉద్రిక్తతలతో రగిలిపోతున్న వేళ.. కొత్తగా ఆవిర్భవించే దేశానికి అశుభ ముహూర్తం ఉందనే భయం ప్రజల్లో ఉండకూడదని భావించారు.

సరిగ్గా ఇక్కడే జవహర్‌లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన, వినూత్నమైన పరిష్కారాన్ని ఆలోచించారు. పాశ్చాత్య కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు దాటగానే కొత్త రోజు (ఆగస్టు 15) ప్రారంభమవుతుంది. కానీ, హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు మొదలవుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం ఇంకా పాత రోజు (ఆగస్టు 14) కిందకే వస్తుంది. పైగా వైదిక జ్యోతిష్యం ప్రకారం పగలు, రాత్రి కలిసే సంధ్యా సమయం లేదా అభిజిత్ ముహూర్తం, రాజ్య స్థాపనకు అత్యంత అనుకూలమైన ‘పుష్య నక్షత్రం’ ప్రభావం ఆ అర్ధరాత్రి వేళ అందుబాటులో ఉన్నట్లు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త కేఎన్ రావు తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ రాజకీయ, జ్యోతిష్య చిక్కుముడిని విప్పడానికి నెహ్రూ ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నమే రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశాన్ని రాత్రి వరకు కొనసాగించి, సరిగ్గా రాత్రి 12 గంటలు కొట్టే సమయానికి స్వాతంత్ర్య ప్రకటన చేశారు. దీనివల్ల పాశ్చాత్యుల లెక్కల ప్రకారం ఆగస్టు 15 ప్రారంభమైనట్లూ అయింది, భారతీయ జ్యోతిష్య లెక్కింపుల ప్రకారం అశుభకరమైన ఆగస్టు 15 సూర్యోదయానికి ముందే అనుకూలమైన ముహూర్తంలో దేశం పురుడు పోసుకున్నట్లూ అయింది. ఈ తెలివైన పరిష్కారానికి మౌంట్‌బాటన్ కూడా సంతోషంగా అంగీకరించారు. అలా, జ్యోతిష్కుల హెచ్చరికలు, లార్డ్ మౌంట్‌బాటన్ పట్టుదల, నెహ్రూ చతురతల కలనేతగా భారత్ ‘అర్ధరాత్రి’ వేళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. “ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారత్ సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది” అంటూ నెహ్రూ ఇచ్చిన చారిత్రాత్మక పిలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఈ ఖగోళ, ముహూర్తాల విచిత్ర సంగ్రామమే. నాటి సంఘటనలు జరిగి దశాబ్దాలు గడిచినా, రాబోయే శనివారం మనం జరుపుకోబోయే 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళలో ఈ ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ వెనుక ఉన్న ఈ ఆసక్తికర కథనం ఎప్పటికీ ప్రత్యేకమైనదే!